"డ్యాన్సులు చేసుకునేవాడివి నువ్వు చెప్పేదేంటి?, సినిమాల్లేకనే హోదా రాజకీయం"
విజయవాడ : సినీ నటుడు శివాజీ ఎంపీ సుజనా చౌదరిపై చేసిన విమర్శలను మూకుమ్మడిగా తిప్పికొడుతున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ఎంపీ శివప్రసాద్.. 'సుజనా మాటెత్తితే నాలుక కోస్తా' అంటూ హెచ్చరించగా.. తాజాగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శివాజీని ఓ బ్రోకర్ అంటూ విమర్శించారు.
శివాజీ వ్యాఖ్యలపై శనివారం నాడు స్పందించిన జలీల్ ఖాన్.. నటుడు శివాజీ ఓ బ్రోకర్ అని ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో శివాజీ తమకు చెప్పేదేంటని ప్రశ్నించారు. సినిమాల్లో డ్యాన్సులు చేసుకునే శివాజీకి హోదా గురించి ప్రశ్నించడానికి ఆయనకున్న అర్హత ఏంటని నిలదీశారు. కేవలం గంటల తరబడి టీవీల్లో కనిపించేందుకే శివాజీ హోదా అంశాన్ని ఎత్తుకున్నారని ఆరోపించారు.

సినిమా అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్న శివాజీ స్టేటస్ ఎక్కడా..? కేంద్రమంత్రి సుజనా స్టేటస్ ఎక్కడా..? అని ప్రశ్నించిన జలీల్ ఖాన్.. శివాజీ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం సుజనాకు లేదని చెప్పుకొచ్చారు. 'హోదాపై పోరాటానికి కనీసం నీ సొంతంగా ఓ పదిమందినైనా తీసుకురాగలవా?' అంటూ శివాజీకి కౌంటర్ ఇచ్చారు.ఇక ముద్రగడ, చిరంజీవి, దాసరిలకు ఉద్యోగాలు లేకనే నోటికొచ్చింది మాట్లాడుతున్నారని విమర్శించారు జలీల్ ఖాన్.
నోరు అదుపులో పెట్టుకో : బుద్దా వెంకన్న
ఇక మరో టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా శివాజీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా అవకాశాలు లేకనే హోదా గళమెత్తుకున్న శివాజీ కేంద్రమంత్రులపై మాట్లాడేముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు వెంకన్న.
హోదా గురించి మాట్లాడుతున్నావా..? వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నావా..? కేంద్రమంత్రులు ఎంపీలంతా హోదా గురించి మాట్లాడుతున్నాం. హోదా గురించి ఏం చేయాలో తమకు తెలుసునని శివాజీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు వెంకన్న. ఎన్నికలప్పుడు బీజేపీకి జై కొట్టి.. ఇప్పుడు టీడీపీని విమర్శించడం సరికాదని శివాజీకి హితవు పలికారు.












Click it and Unblock the Notifications