ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశానో బయటపెట్టిన మేకపాటి..
నెల్లూరు: శాసన మండలి ఎన్నికల్లో తాను అధిష్ఠానం చెప్పినట్టే ఓటు వేశానని నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాను ఓటు వేసిన జయమంగళ వెంకటరమణ విజయం సాధించారని గుర్తు చేశారు. తాను అధిష్ఠానం చెప్పినట్టే నడుచుకున్నానని వివరణ ఇచ్చారు. మధ్యలో కొందరు చిల్లర నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తోన్నారని, అధిష్ఠానానికి-తనకు మధ్య దూరం పెంచుతున్నారని మండిపడ్డారు.
ఆ ఆరోపణలు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పంచుమర్తి అనురాధకు ఆయన ఓటు వేశారనే వార్తలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారని, దీనికి అంగీకరించకపోవడం వల్లే క్రాస్ ఓటింగ్ చేశారనే వాదనలు వినిపిస్తోన్నాయి.
దురుద్దేశపూరకంగా..
ఈ ఆరోపణలపై మేకపాటి స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. తనపై దురుద్దేశపూరకంగా వార్తలు సృష్టిస్తోన్నారని అన్నారు. అధిష్ఠానం సూచించిన అభ్యర్థికే తాను ఓటు వేశానని స్పష్టం చేశారు. కొందరు చిల్లర నాయకులు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు. సోషల్ మీడియాను వినియోగించుకుని వీడియో క్లిప్పులు చేస్తూ దుష్ప్రచారానికి తెర తీశారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ చిల్లర నాయకులను సృష్టించింది కూడా అధిష్ఠానమేనని చెప్పారు.

టికెట్ దక్కకూడదనే..
ఓటు వేసిన తరువాత తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని, తోటి శాసన సభ్యులతోనూ చాలాసేపు కలిసి తిరిగానని చెప్పారు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదని చెప్పారు. రాజకీయాల్లో రాణించని జిల్లా నాయకులు, గెలవని వాళ్లు, మాజీలు.. అందరూ కలిసి తనపై ఈ దుష్ప్రచారం చేస్తోన్నారని మేకపాటి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ దక్కనివ్వకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తోన్నారని ఆరోపించారు. వీటిని ఎవరూ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పుడు, నిబంధనల ప్రకారమే ఉదయగిరి నియోజకవర్గంలో తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులే తీసేశారని గుర్తు చేశారు.
ఫ్లెక్సీలు తీసింది ఇప్పుడు కాదు..
వాటిని ఇప్పుడు తాను దగ్గరుండి తీసేసినప్పుడు రెండు న్యూస్ ఛానళ్లు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోన్నాయని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాను ఓ టీవీ ఛానల్ తో మాట్లాడి వివరణ ఇవ్వగా.. వాళ్లు ఆ న్యూస్ క్లిప్ ను తొలగించారని చెప్పారు. మరో న్యూస్ ఛానల్ ఇంకా దాన్ని ప్రసారం చేస్తోందని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వ అధికారులే తన ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను తొలగించారని, వారిని వెళ్లి అడగాలని సూచించారు.












Click it and Unblock the Notifications