జగన్ చంద్రబాబులాగా మాటల మనిషి కాదు; లోకేష్ పైనా జగన్ మేనమామ ఫైర్!!
నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి భూ బకాసురుడు అని సంబోధించారు. ఎక్కడ భూమి ఉన్నా కబ్జా చేస్తున్నాడని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చంద్రబాబు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కావడం ఏపి ప్రజల దురదృష్టమని ఆయన విమర్శించారు. వేల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, హామీలు అమలు చేయని ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని తాను అమలు చేశాను అని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అవినీతి రాష్ట్రంగా పేరు పొందిందని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

టీడీపీ హయాంలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల భర్తీ విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు చదువుకునే రోజుల్లో ఎంత ఆస్తి ఉంది? ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది? అనేది ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. జగన్ పై ఆరోపణలు చేయడం మినహాయించి చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్ లో ఉంటారని, పోటీ చేసేది మాత్రం కుప్పం, మంగళగిరిలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 51% ఓట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ నాంది పలికారని పేర్కొన్నారు.

చంద్రబాబు లాగా జగన్ మాటల మనిషి కాదని చేతల మనిషని, అభివృద్ధి ఏమిటో చేసి చూపించారని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రజలు దేవుడిలాగా చూస్తున్నారని, కానీ పద్నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ను ఒక్కరైనా అలా చూశారా? అంటూ ప్రశ్నించారు. తుఫానును ఆపింది నేనే, గాలిని ఆపింది నేనే అంటూ గాలి కబుర్లు చెప్పే వ్యక్తి జగన్ కాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications