తెరాస కార్యకర్తలపై శ్రీశైలం గౌడ్ అనుచరుల దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కుత్భుల్లాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలపై శాసనసభ్యుడు శ్రీశైలంగౌడ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గత అర్థరాత్రి జగద్గిరిగుట్టలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారం తెలుసుకున్న తెరాస కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో శాసనసభ్యుడు పోలీసులతో అక్కడకు చేరుకుని డబ్బులు పంచుతున్న వ్యక్తిని వదిలేసి తెరాస కార్యకర్తలపై పడిగుద్దులు కురిపించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఎమ్మెల్యే శ్రీశైలం అనుచరులు తెరాసకు చెందిన రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను ఖండించిన తెరాస నేతలు జీడిమెట్ల పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
ఇదిలావుంటే, మెదక్ జిల్లాలోని గజ్వేల్‌లో తనిఖీలు నిర్వహించి భారీగా మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం బొలెరో వాహనంలో తరలిస్తున్న 20 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, మద్యప్రదేశ్‌కు చెందిన మద్యంగా పోలీసులు గుర్తించారు. వీటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications