టీడీపీ దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్
Varudu Kalyani: తెలుగుదేశం- జనసేన పార్టీ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ డిక్లరేషన్ మోసపూరితమంటూ విమర్శించారు.
పాత హామీలన్నింటికీ మసాలా దట్టించి మళ్లీ బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ డిక్లరేషన్‌ను ప్రకటించారని వరుదు కల్యాణి ఆరోపించారు. అది బీసీ డిక్లరేషన్ కాదని..బాబు చీటింగ్ డిక్లరేషన్ అని అభివర్ణించారు. బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాంధవుడు లాంటివారయితే- చంద్రబాబు రాబంధువు వంటి వాడని మండిపడ్డారు.

ఏపీలో చీటింగ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. అబద్దానికి ఆధార్ కార్డు.. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు బీసీలకు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానని ఎగ్గొట్టిన ద్రోహి అని, బీసీ కమిషన్ అని చెప్పి ఆ ఊసే లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
బీసీలు జడ్జిలుగా పనికి రారంటూ కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు వరుదు కల్యాణి. ఏటా 10,000 కోట్ల రూపాయల చొప్పున అయిదేళ్లలో 50,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి 19,000 కోట్లకే పరిమితం చేసిన చంద్రబాబు బీసీ ద్రోహిగా ఆరోపించారు. బీసీల తోకలు కత్తిరిస్తానని, అంతు చూస్తానని చంద్రబాబు అవమానించారని ఆమె గుర్తు చేశారు.
చంద్రబాబు దృష్టిలో బీసీ అంటే..బాబు క్యాస్ట్ అని అన్నారు వరుదు కళ్యాణి. చంద్రబాబు తన 'బీసీ'లకు మాత్రం న్యాయం చేశారని, వారికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు ఇచ్చారని విమర్శించారు. తన హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీని అయినా పంపించారా? అని నిలదీశారు.
బీసీ కులగణనను తమ ప్రభుత్వమే చేపట్టిందని వరుదు కల్యాణి గుర్తు చేశారు. స్పీకర్‌గా బీసీ నాయకుడికి అవకాశం ఇచ్చారని, అలాగే- మంత్రివర్గంలో 11 మందికి జగన్ చోటు కల్పించారని చెప్పారు. ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో 60 శాతం బీసీలే ఉన్నారని, 54,000 మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications