బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: ముసురు
ఏపీలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు భయపెట్టిన ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈ తెల్లవారు జాము నుంచి పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఇదే పరిస్థితి ఇంకొన్ని గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు సైతం వీస్తోన్నాయి. అక్కడక్కడా పిడుగులు పడిన సందర్భాలు లేకపోలేదు.
రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇదివరకే హెచ్చరించింది. దీనికి అనుగుణంగా వర్షాలు పడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ తెల్లవారు జాము నుంచి అమలాపురం, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత అధికంగా కనిపించింది. ఇక్కడ వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారింది. ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిస్తోన్నాయి. ఆయా జిల్లాల్లో గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు రికార్డయ్యాయి.
అమలాపురంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఇక్కడ వర్షం దంచి కొడుతోంది. నంద్యాలతో పాటు జిల్లాలోని మహానంది, బండిఅత్మకూరు, పాణ్యంలో భారీ వర్షం కురిసింది. ఈ తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీని దెబ్బకు నంద్యాలలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపునీరు నిలిచింది. నెల్లూరు జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదైంది. కావలి, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఈ వర్షాలకు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణమైంది. నార్త్ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఇదివరకే వెల్లడించింది. సైక్లోనిక్ సిస్టమ్ క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications
