దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం! రుతుపవనాలు వెళ్లిపోతున్న వేళ వానలే వానలు
ఒకవైపు దేశం నుంచి నైరుతి రుతుపవనాలు తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించినా.. మరోవైపు వర్షాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాతావరణ పరిణామాల కారణంగా దక్షిణ భారతదేశంలో మళ్లీ వర్షాల ప్రభావం గట్టిగా ఉండనుంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ ఆదివారం (సెప్టెంబరు 20) తెలుగు రాష్ట్రాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విడతల వారీగా కురిసే ఈ వర్షాలు, ఈదురుగాలుల వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది.
తెలుగు రాష్ట్రాలకు 'విండ్ వార్నింగ్'.. 50 కి.మీ వేగంతో గాలులు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశముంది. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, కొంకణ్ పరిసర ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన మోస్తరు వానలు కురవనున్నాయి.

బంగాళాఖాతంలో ద్రోణి తీవ్రం.. రెండు రోజుల్లో దిశ మార్పు!
ఉత్తర అండమాన్ సముద్రంలో శుక్రవారం నాటికి ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుండటం ప్రస్తుత వాతావరణ మార్పులకు ప్రధాన కారణంగా మారింది. ఇది సెప్టెంబరు 21 నాటికి వాయుగుండంగా, 22వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆ తర్వాత ఇది ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వేగంగా దూసుకురానుంది. సెప్టెంబరు 23 నాటికి ఈ వ్యవస్థ తీరానికి చేరుకోవడంతో రానున్న వారం రోజుల్లో తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదముంది.
రుతుపవనాల తిరుగు ప్రయాణం.. అయినా తగ్గని వాన ముప్పు!
మరోవైపు, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. సాధారణంగా సెప్టెంబరు 17 నుంచి ఉపసంహరణ ప్రారంభమవ్వాల్సి ఉండగా, ఈసారి రెండు రోజులు ఆలస్యంగా సెప్టెంబరు 19న పశ్చిమ రాజస్థాన్ పరిసరాల నుంచి రుతుపవనాలు వెనక్కి తగ్గడం మొదలైంది. రాబోయే మూడు నలుగు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ పరిసర ప్రాంతాల నుంచి ఇవి పూర్తిగా నిష్క్రమించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది. అయితే, వాయువ్యంలో రుతుపవనాలు వీడుతున్నప్పటికీ.. బంగాళాఖాతంలో బలం పుంజుకుంటున్న తుఫాను వ్యవస్థల వల్ల దక్షిణ, తూర్పు జిల్లాల్లో రానున్న కొద్దిరోజులు వానల ముప్పు కొనసాగనుంది.














Click it and Unblock the Notifications
