మే 16న రుతుపవనాలపై బిగ్ అప్‌డేట్!
భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు, సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల రాకకు గడువు సమీపిస్తుండటంతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మే 16వ తేదీ నాటికి ఇవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన అల్పపీడనం, సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.

జిల్లాల వారీగా వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర & యానాం:
రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రేపు, ఎల్లుండి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఇక్కడ కూడా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీస్తాయి.
రాయలసీమ:
ఈ ప్రాంతంలో ఈరోజు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, రేపటి నుండి గాలి వేగం మరింత పెరిగే అవకాశం ఉంది.
తీవ్రంగానే ఎండలు.. అప్రమత్తత అవసరం!
వర్ష సూచన ఉన్నప్పటికీ, పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం నాడు కర్నూలు జిల్లా నగరడోనలో గరిష్టంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, కడప జిల్లాల్లో కూడా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండరాదని, వర్షం సమయాల్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications