ఎన్నికల వేళ టీడీపీకి సిట్టింగ్ ఎంపీ గుడ్ బై..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. జగన్ తిరిగి అధికారం పైన ధీమాగా ఉన్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా టీడీపీ - జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితా పైనా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ఎంపీల అభ్యర్దుల పైన ఫోకస్ చేసారు. ఈ కీలక వేళ టీడీపీ సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడటం కలకలంగా మారుతోంది.
పొత్తుల లెక్కలు
టీడీపీ - జనసేన పొత్తుతో అభ్యర్దుల లెక్క తేలాల్సి ఉంది. జనసేన కు టీడీపీ 30 సీట్లు కేటాయిస్తుందని 2 లోక్ సభ సీట్లు ఇస్తారని చెబుతున్నారు. బీజేపీ నుంచి పొత్తు పైన స్పష్టత వచ్చిన తరువాత అధికారికంగా సీట్ల పైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక..ఇప్పుడు వైసీపీ లో ఇంఛార్జ్ ల మార్పు వివాదంగా మారుతుందని తమకు కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు వేస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ వీడనున్నట్లు సమాచారం. ఆయన రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించారని చెబుతున్నారు. కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో తనను గెలిపించిన నియోజకవర్గానికి గల్లా జయదేవ్ దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో పార్టీలో వరుసగా రెండు సార్లు గెలిచిన జయదేవ్ నిర్ణయం పార్టీలో చర్చకు కారణమవుతోంది.

రాజకీయాలకు దూరం
ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడటం లేదని గల్లా జయదేవ్ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.టీడీపీకి వచ్చే లోక్ సభకు పోటీ చేసేందుకు అభ్యర్దులు ముందుకు రావటం లేదని ప్రచారం సాగుతోంది. అటు టీడీపీ -జనసేన పొత్తులో భాగంగా క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల ఆశావాహుల్లో ఎవరికి సీట్లు వస్తాయి .. ఎవరికి రావనేది కీలకంగా మారుతోంది. సీట్లు రాని పార్టీ నేతల నుంచి వచ్చిన పార్టీ అభ్యర్దికి సహకారం సాధ్యం అయ్యేలా కనిపించటం లేదు. అటు వైసీపీ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్దుల ఖరారుతో పాటుగా ఎంపీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. పలువురు సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యేలుగా.. కొందరు మంత్రులు, సీనయిర్లను లోక్ సభకు పంపేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు.
అభ్యర్దుల కసరత్తు
ఈ సమయంలోనే టీడీపీ నుంచి జనసేనకు రెండు లోక్ సభ సీట్లు ఇస్తారని చెబుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నానికి తిరిగి విజయవాడ సీటు ఇస్తారా లేదా అనేది సందేహంగానే కనిపిస్తోంది. నానికి సీటు ఇస్తే సొంత పార్టీ నుంచే సహకారం అందేలా లేదు. విజయవాడ నగరంలోనే టీడీపీలో వర్గ విభేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక..జనసేన కోరుతున్న సీట్లలో టీడీపీ నేతలు పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరికి సీటు ఫైనల్ అవుతుందనేది రెండు పార్టీల ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీట్లు రాని నేతలు పార్టీలో ఉంటారా..లేక వేరే వైపు చూస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. అటు తాజా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. దీంతో..ఇప్పుడు టీడీపీ -జనసేనలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయనే ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications