ఏపీలో టీడీపీ - బీజేపీ పొత్తు ఖరారేనా : బీజేపీ ముఖ్య నేత తేల్చిందేంటి..!!
ఏపీలో మరోసారి టీడీపీ - బీజేపీ పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా. టీడీపీ శ్రేణులతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న చర్చ ఇది. ఈ పొత్తు వ్యవహారం పైన టీడీపీ నుంచి మాత్రం అధికారికంగా ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే సమయంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ వార్తలపైన స్పదించిన బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ థియోధర్ ఏపీలో టీడీపీ - వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగాన్ని సునీల్ థియోధర్ ప్రస్తావించారు. ఇక, ఇప్పుడు ఇదే అంశం పైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.

ఆ ప్రచారం పట్టించుకోవాల్సిన అవసరం లేదు
ఏపీలో తమకు జనసేన మాత్రమే మిత్రపక్షమని చెబుతూ.. ఆ పార్టీతో మాత్రమే కలిసి పని చేస్తామని సునీల్ థియోధర్ స్పష్టం చేసారు. ఇప్పుడు స్పందించిన జీవీఎల్.. పొత్తుల విషయంలో వస్తున్న కధనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. దీనికి కొనసాగింపుగా కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో రాస్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. ఇప్పుడు జీవీఎల్ 175 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని చెప్పటం ద్వారా.. జనసేనతోనూ పొత్తు ఇక ఉండదనే అంచనాకు బీజేపీ నేతలు వచ్చారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

175 స్థానాలు పోటీ చేస్తామని చెప్పటం వెనుక
బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో బీజేపీ - జనసేన మధ్య పొత్తు కుదిరింది. కానీ, రెండు పార్టీలు కలిసి చేసిన ఉద్యమాలు.. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు లేవు. కొంత కాలంగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటనలు చేస్తున్నారు. జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వమని..వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టీడీపీ - బీజేపీతో కలిసి 2014 ఎన్నికల తరహాలో పోటీ చేయాలనేది అటు టీడీపీ ..ఇటు జనసేన కోరుకుంటున్నాయి. కానీ, బీజేపీ నుంచి టీడీపీతో కలవటం పైన స్పష్టత రాకపోవటంతో జనసేనాని పొత్తుల పైన అప్పుడే ఏం చెప్పలేమని.. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పారు. టీడీపీతో వెళ్లాలనుకుంటున్న జనసేనతోనూ బీజేపీ దూరం అయ్యేందుకు సిద్దమైందా అనే చర్చ ఇప్పుడు జీవీఎల్ వ్యాఖ్యలతో మొదలైంది.

ఏపీలో ఆసక్తిగా మారుతున్న పొత్తుల అంశం
తాజాగా.. ఢిల్లీ కేంద్రంగా ఒక సమావేశంలో ప్రధాని మోదీ - టీడీపీ అధినేత చంద్రబాబు పలకరింపులతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంశం పైన అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు వరుసగా బీజేపీ ముఖ్య నేతలు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ తామే ఒంటరిగా పోటీకి దిగుతున్నామనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు..జరుగుతున్న ప్రచారం పైన వైసీపీ ఫోకస్ చేసింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీకి కేంద్రంలో అవసరమైన ప్రతీ సందర్భంలోనూ వైసీపీ మద్దతుగా నిలిచింది. ఇప్పుడు తిరిగి టీడీపీ తో బీజేపీ పొత్తు వార్తల నేపథ్యంలో.. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటంతో..ఏపీలో పొత్తుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications