కూటమికి 125నుంచి 150 స్థానాలు, శ్రీవారి సన్నిధిలో అబద్దం చెప్పను.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపైన వైసిపి, టిడిపి నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని టిడిపి కూటమి నేతలు, వైసిపి మళ్లీ అధికారాన్ని చేపడుతుందని, జగన్ సీఎం అవుతారని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో రఘురామ కృష్ణంరాజు
ఇక ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ స్థానాలను, 22 పార్లమెంటు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోబోతుంది అంటూ మళ్ళీ అధికారం మనదేనంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామిని దర్శించుకున్న రఘురామ కృష్ణంరాజు కు ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఏపీ ఎన్నికల్లో కూటమికి 125 నుంచి 150 స్థానాలు
దర్శన అనంతరం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీలో ఎన్నికల ఫలితాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. వైసిపి 25 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
నా మాట నిజం అవుతుందో.. జగన్ మాట నిజమవుతుందో చూద్దాం
తాను తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నానని శ్రీవారి సమక్షంలో అబద్దాలు చెప్పనని పేర్కొన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాను చెప్పిన మాట నిజమవుతుందో జగన్ మాట నిజం అవుతుందో జూన్ 4వ తేదీన తెలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని తాను శ్రీవారిని వేడుకున్నట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ఏపీకి చంద్రబాబు సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్న రఘురామ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని తాను స్వామివారిని ప్రార్థించినట్టు రఘురామ వెల్లడించారు. జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలలో సీఎం జగన్ ఆశలు ఆవిరి అవుతాయని రఘురామ పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమార్లు కూటమి విజయం ఖాయమని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు నేడు తిరుమల వేదికగా కూడా గెలవబోయేది టిడిపి బిజెపి జనసేన కూటమి మాత్రమేనని మరో మారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications