మరిది కళ్లలో ఆనందమే టార్గెట్ - పురందేశ్వరిపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై వైసీపీ నేతల మండిపడుతున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని పురందేశ్వరి టార్గెట్ చేసారు. చంద్రబాబు చెప్పిన అంశాలనే పురందేశ్వరి ప్రస్తావిస్తున్నార ని మంత్రి రోజా ఆరోపించారు. మంత్రులు బొత్సా..విడదల రజనీ సైతం పురందేశ్వరి ఏపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలను ఖండించారు. ఇప్పుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్య లు చేసారు.
పాలనపై పురందేశ్వరి విమర్శలు
పురందేశ్వరి ఏపీ లో వైసీపీ పాలన పైన తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. ఏపీలో ఆర్దిక పరిస్థితి పైన చేసిన ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఏపీలో అప్పుల గురించి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పు బడుతున్నారు. పార్లమెంట్ లో ఏపీ ఆర్దిక పరిస్థితి పైన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అనే సందేహం వస్తోందని మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్టునే పురందేశ్వరి చదువుతున్నారని మంత్రులు అమర్నాధ్, రజనీ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని గుర్తు చేస్తున్నారు.
సాయిరెడ్డి ట్వీట్ వైరల్
తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి ట్వీట్ చేసారు. అందులో పురందేశ్వరిని టార్గెట్ చేసారు. సాయిరెడ్డి తన ట్వీట్ లో... అమ్మా, పురందేశ్వరిగారు...బీజేపీ అంటే "బాబు జనతా పార్టీ" కాదు! బాబుది స్క్రిప్ట్... వదినది డైలాగ్! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ...మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్! మీ నాన్నగారు మహానటులు... మీరు కాదనుకున్నాం.
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!..అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయంగా వైరల్ అవుతోంది. దీని పైన పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు అవుతున్నాయి.
కేంద్రానికి మద్దతిస్తున్న వేళ
పురందేశ్వరి విశాఖ పర్యటన సమయంలో ఫ్లెక్సీల ఏర్పాటు పైన తాజాగా సాయిరెడ్డి ట్వీట్ చేసారు. గతంలో చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా వరుస ట్వీట్లతో టార్గెట్ చేసిన సాయిరెడ్డి కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. రాజకీయంగా ఇప్పుడు వైసీపీ వ్యవహారాల్లో తిరిగి యాక్టివ్ అయ్యారు. పార్లమెంట్ లో మద్దతుగా అవిశ్వాస తీర్మానం..ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లులో వైసీపీ మద్దతుగా నిలుస్తుందని విజయ సాయిరెడ్డి తేల్చి చెప్పారు.
అటు బీజేపీ ముఖ్య నాయకత్వానికి అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న తమ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఆరోపణలు చేయటాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. దీంతో, పురందేశ్వరి పైన కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. సాయిరెడ్డి ట్వీట్ పైన బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications