జగన్ మేనిఫెస్టో "సిద్దం" - రైతులు, మహిళలకు ఇచ్చే హామీలేంటి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. ఈ నెల 10న అద్దంకిలో జరిగే సిద్దం సభలో జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని పార్టీ మఖ్య నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో రైతులు, మహిళలకు హామీలు ఉంటాయని చెబుతున్నారు. చివరి సిద్దం సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
నెల్లూరులో సాయిరెడ్డి:పుట్టి, పెరిగిన గడ్డ నెల్లూరులో పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తానని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్ది సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను.. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారని తెలిపారు. అభ్యర్దిగా ప్రకటించిన తరువాత సాయిరెడ్డి తొలిసారి నెల్లూరు వచ్చారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. మరోసారి వైయస్ఆర్ సీపీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేసారు.

జగన్ మేనిఫెస్టో సిద్దం:శాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదు.. ఆ మాటల వెనుక దురుద్దేశం ఉందన్నారు. వేమిరెడ్డి తనకు మంచి మిత్రుడని, రాజకీయం వేరు, స్నేహం వేరు అని చెప్పుకొచ్చారు. జిల్లా మీద తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. సిద్దం సభలో జగన్ ప్రకటించే మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న వైఎస్సార్ రైతు భరోసా రూ 20 వేలకు పెంచుతారని భావిస్తున్నారు. అమ్మఒడి ప్రస్తుతం ఒక బిడ్డకే అమలు చేస్తుండటంతో...ఇద్దరికి పెంచే అవకాశం ఉందని సమాచారం.
మేనిఫెస్టో హామీలపై ఉత్కంఠ:రైతురుణామఫీ పైన ప్రకటన ఉంటుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే, రైతు భరోసా పెంచితే రుణమాఫీ అమలు ఉండటం సాధ్యమేనా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు నాలుగు విడతలుగా పెంచేలా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొదుపు సంఘాల మహిళలకు ప్రస్తుత హాయంలో రుణ మాఫీ చేయటంతో..వారికి ఆర్దికంగా ప్రయోజనం కలిగే హామీలను ప్రకటిస్తారని చెబుతున్నారు. ప్రస్తుత హామీలు కొనసాగిస్తూనే కొత్తవి ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. దీంతో...జగన్ సిద్దం సభలో చేసే మేనిఫెస్టో ప్రకటన పైన ఇప్పుడు వైసీపీతో పాటుగా రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications