మేయర్ పీఠాలు దక్కేదెవరికి, ఎవరి బలం ఎంత- వైసీపీ ఆశలన్నీ అక్కడే..!!
మున్సిపల్ పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. కూటమి- వైసీపీ మధ్య ఈ పోటీ ప్రతిష్ఠాత్మకం గా మారింది. 13 కార్పొరేషన్లతోపాటు 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. అధికార కూటమి ఏకపక్షంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కూటమికి షాక్ ఇచ్చి తమ బలం నిరూపణ చేసుకోవాలని వైసీపీ డిసైడ్ అయింది. దీంతో ఈ సారి 13 మున్సిపల్ కార్పోరేషన్ల పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. వైసీపీ ఎంపిక చేసిన కార్పోరేషన్ల పైన గురి పెట్టింది. ఈ సాయంత్రం నుంచి పోలింగ్ వరకు చోటు చేసుకునే పరిణామాలు కీలకంగా మారుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం అవుతోంది. మొత్తం 13 కార్పోరేషన్లను సొంతం చేసుకోవాలనే వ్యూహంతో కూటమి కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ సైతం ప్రత్యేకంగా కొన్ని కార్పోరేషన్ల పైన ఫోకస్ చేసింది. ప్రధానంగా విజయవాడ కార్పోరేషన్ లో త్రిముఖ పోరు నెలకొంది. కూటమి నుంచి వంగవీటి రాధ.. వైసీపీ నుంచి రాయన భాగ్యలక్ష్మి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు కూడా బరిలో నిలవడం పోటీకి మరింత ఆసక్తిని జోడిస్తోంది. ఏబీకి లభించే మద్దతు ఇక్కడ కీలకంగా మారుతోంది. ఇక.. విశాఖలో 120 వార్డులు ఉన్నాయి. వైసీపీ తరఫున వరుదు కల్యాణి, టీడీపీ నుంచి ముక్కా శ్రావణి మేయర్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
కొన్ని వార్డుల్లో రెబల్స్ బరిలో ఉన్నారు. కూటమి ఇక్కడ బలంగా ఉన్నా.. వరుదు కల్యాణి ప్రచారం లో దూసుకెళ్లటంతో వైసీపీలో అంచనాలు పెరుగుతున్నాయి. విజయనగరం కార్పొరేషన్‌లో పోరు ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి కోలగట్ల శ్రావణి, టీడీపీ నుంచి అవనాపు భార్గవి పోటీలో ఉన్నారు. వైసీపీ ప్రత్యేకంగా గురి పెట్టిన వాటిలో విజయనగరం ఉంది. ఇక్కడ హోరా హోరీ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

వేగంగా మారుతున్న సమీకరణాలు
కాగా.. గుంటూరు, ఒంగోలు కార్పోరేషన్లలో కూటమి ప్రచారం సమయం నుంచి తమ సత్తా చాటుతూ ముందుకు వెళ్తోంది. రెండు చోట్ల కూటమి భారీ మెజార్టీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇక.. నెల్లూరు కార్పోరేషన్ లో రాజకీయం ఆసక్తిగా మారింది. తాజా పరిణామాలు వైసీపీలో ఆశలు పెంచుతున్నాయి. కూటమి మాత్రం గెలుపు కోసం పట్టుదలతో ఉంది. దీంతో.. పోలింగ్ జరిగే తీరు విజేతను డిసైడ్ చేయనుంది. కడప లో వైసీపీ ఓడించాలని టీడీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ ఎలాగైనా గెలిచి తమ పట్టు కోల్పోలేదని నిరూపించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అదే విధంగా అనంతపురం బీజేపీకి కేటాయించటంతో ఇక్కడ వైసీపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. తిరుపతి, చిత్తూరులోనూ రెండు వైపులా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. పోలింగ్ ఎంత మేర నమోదు అవుతుందీ.. చివరి నిమిషంలో ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారు.. ఎవరికి ఎన్ని కార్పోరేషన్లు దక్కుతాయనేది ఉత్కంఠగా మారుతోంది.













Click it and Unblock the Notifications
