నాగార్జునసాగర్, శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ డేంజర్ బెల్స్.. తాగునీటికి గండం
తెలుగు రాష్ట్రాలలో వేలాది గ్రామాలకు తాగునీటిని, సాగునీటిని అందించే నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం నీటి కటకట చోటుచేసుకుంది. ఒకపక్క భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో పాటు మరోపక్క రిజర్వాయర్లలో నీళ్లు కూడా స్టోరేజ్ కి చేరుకుంటున్న పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తాగునీటికి పొంచి ఉన్న గండం
.ఇప్పటికే సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతుంటే రైతులు విలవిలలాడుతున్నారు. మరోవైపు తాజా పరిస్థితులతో తాగునీటికి కూడా ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఈ ప్రభావం హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరాపై పడనుంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508.50అడుగులుగా ఉంది.

సాగర్ లో డెడ్ స్టోరేజ్ కన్నా తక్కువగా నీరు
డెడ్ స్టోరేజి 510అడుగుల కన్నా ఒకటిన్నర అడుగు నీరు తక్కువగా ఉండటంతో భవిష్యత్తులో నీటిలభ్యతకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.గత రెండేళ్ళుగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆశించిన స్ధాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్ధితి తలెత్తినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సాగర్ కు ఎలాంటి ఇన్ ఫ్లో లేకపోగా ఆంద్రప్రదేశ్ తాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువ ద్వారా 5700క్యూసెక్కుల నీటిని, హైదరాబాద్ తాగునీటికోసం మరో 800క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
సాగర్ మాత్రమే కాదు శ్రీశైలంలోనూ అదే పరిస్థితి
సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువైనప్పటికీ 505 అడుగుల నీటి మట్టం వరకు తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల అధికారులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక శ్రీశైలం జలాశయంలో కూడా నీటి నిలువలు భారీగా తగ్గాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరమైన 215 టీఎంసీలకు 34 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు వారం రోజుల క్రితం అధికారులు వెల్లడించారు.
అదే జరిగితే కృష్ణా పరీవాహక ప్రాంతంలో దారిద్ర పరిస్థితులు
అయితే శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 809.90 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ సంవత్సరం కూడా జూన్ జూలై ఆగస్టు నెలలో సరైన వర్షపాతం నమోదు కాకపోతే, ఎగువ నుంచి వరదనీరు రాకపోతే, కృష్ణా పరివాహక ప్రాంతంలో దారిద్ర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
సాగునీటికి నో చాన్స్ .. కేవలం త్రాగునీరు మాత్రమే
ఇక తాజా పరిస్థితులతో సాగునీటి విడుదలకు ఛాన్సే లేదని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి కోసం జాగ్రత్తగా వాడుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఏదేమైనప్పటికీ నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆందోళన వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications