అమరావతి పాదయాత్రలో నందమూరి ఫ్యామిలీ ఎంట్రీ-రాజధానులపై కీలక వ్యాఖ్యలు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు,. కృష్ణా జిల్లాల్ని దాటుకుని పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతున్న ఈ యాత్రకు స్ధానికంగా మద్దతు పెరుగుతోంది. దీంతో ఈ పాదయాత్రను అడ్డుకోవాలని వైసీపీ మంత్రులు, నేతలు పిలుపునిస్తున్నారు.
అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్రకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెండు ఉమ్మడి జిల్లాల్ని పూర్తి చేసుకుని మూడో జిల్లాలో సాగుతున్న ఈ యాత్రకు విపక్షాల మద్దతు లభిస్తోంది. దీంతో పాటు మాజీ సీఎం ఎన్టీఆర్ కుటుంబం కూడా రంగంలోకి దిగుతోంది. రైతుల పాదయాత్రకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోదరుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఇవాళ మద్దతు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ అమరావతి ఉద్యమంలో కానీ, పాదయాత్రలో కానీ నేరుగా కనిపించని నందమూరి కుటుంబం తొలిసారి రంగంలోకి దిగినట్లయింది.

అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మద్ధతు పలికారు. మహా పాదయాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగుతుండగా అక్కడికి చేరుకున్న నందమూరి రామకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. పెనుగొండ, కవటం, మార్టేరు మీదుగా మూడు గంటలపాటు నందమూరి రామకృష్ణ పాదయాత్ర చేశారు.భారీవర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన రైతులతో కలిసి నడిచారు. అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాజధాని కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులను అవమానిస్తూ హేళనగా మాట్లాడటం తగదన్నారు. వైసీపీ నేతలు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చుంటే భూమి విలువ ఏమిటో వారికి తెలిసేదని అన్నారు. ప్రపంచంలో గానీ, దేశంలో గానీ ఎక్కడా మూడు రాజధానులు విజయవంతమైన దాఖలాలు లేవని రామకృష్ణ తెలిపారు. నిజమైన పాలనా వికేంద్రీకరణను మండల వ్యవస్థ ద్వారా దివంగత నేత ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు హయాంలో కియా, హీరో, హోండా, ఇసుజు, అశోక్ లేలాండ్, మొబైల్ ఫోన్ల పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, 11 జాతీయ విశ్వవిద్యాలయాలను జిల్లాకు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేసి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించారన్నారు.












Click it and Unblock the Notifications