ఎమ్మెల్యేకు సవాల్! ప్రతిసవాల్!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలోని నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మరో నేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి రెడీనా?
పోలీస్ కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసిన నిందితులను కడప ఎమ్మెల్యే రవిచంద్ర కేంద్ర కారాగారానికి వెళ్లి పరామర్శించినట్లు మలికిరెడ్డి ఆరోపించారు. తాను జైలుకు వెళ్లి వారిని పరామర్శించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, నిరూపించకపోతే రాజగోపాల్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర సవాల్ విసిరారు. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మలికిరెడ్డి ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఎటువంటి ఆధారాలు చూపించినా రవిచంద్ర అధికార దర్పంతో వాటిని అవాస్తవాలు చిత్రీకరిస్తారన్నారు. నంద్యాలలోని రౌడీ మూకలు ఎమ్మెల్యే అండ చూసుకొని రెచ్చిపోతున్నారన్నారు.

మూడేళ్లలో 20 హత్యలు జరిగాయి
నంద్యాల పరిధిలో గత మూడు సంవత్సరాల్లో 15 నుంచి 20 హత్యలు జరిగాయని, శాంతి భద్రతలు లోపించడానికి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రే కారణమని మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగించకపోతే తామే హైకోర్టులో రిట్ వేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్దామని, ఇద్దరం కలిసి వెళదామన్నారు. శాంతి భద్రతలు కాపాడలేనప్పుడు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నడిరోడ్డుపై కానిస్టేబుల్ ను హత్యచేశారు
డిఎస్పీ కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్‌ను రౌడీషీటర్లు నడిరోడ్డుపై హతమార్చారు. హత్య జరిగి కొన్ని వారాలు గడిచిన తర్వాతే నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. మరికొందర్ని ఇప్పటికి అరెస్ట్ చేయలేకపోయారు. వారికోసం దర్యాప్తు కొనసాగుతోంది. గత మూడు సంవత్సరాల కాలంలో నంద్యాలలో రాజకీయ ప్రేరేపిత హత్యలు జరిగాయని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications