చంద్రబాబు బర్త్ డే స్పెషల్.. రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి !
ఏపీలో పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. ఏప్రిల్ 20, 2026 నాడు సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. ఈ మేరకు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అన్న క్యాంటీన్ సీఈవోకు ఆమె చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమన్నారు. కేవలం రూ.5 లకే అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, గౌరవంగా భోజనం అందించడం అభినందనీయమని కొనియాడారు. రోజువారీ కూలీలు, నిరుపేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజున పేదల కడుపు నింపే కార్యక్రమానికి విరాళం ఇవ్వడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా మించిన సంతృప్తి మరొకటి ఉండదని, తాను పలు సందర్భాల్లో అన్న వితరణలో పాల్గొన్నప్పుడు కలిగిన అనుభూతిని గుర్తుచేసుకున్నారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కూడా 12 ఏళ్లుగా ఏటా తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. "ఈ ఏడాది మీ పుట్టినరోజుకు మేమిచ్చే బహుమానం ఇదే" అంటూ ఆమె చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు, తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి భారీ విరాళం ఇచ్చిన అర్ధాంగి భువనేశ్వరిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప యజ్ఞంలా ముందుకు తీసుకెళుతున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో నాలుగు దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. అదే స్ఫూర్తితో అన్న క్యాంటీన్ల సేవలను మరింత విస్తరించాలి" అని అన్నారు.
నాణ్యతను పాటిస్తూ, పవిత్రంగా, గౌరవంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో భోజనానికి అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని, తద్వారా ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయక బ్రాండ్‌గా మారాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications