వివాదాల వేళ.. తెరపై నారా భువనేశ్వరి!!
Nara Bhuvaneswari: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ మొత్తాన్నీ ధ్వంసం చేశారు. ఏ వస్తువును కూడా మిగలనివ్వలేదు. ఈ ఘటనపై పలు కేసులు నమోదయ్యాయి.
సోమవారం రాత్రి నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తోన్నారు నల్లపరెడ్డి. రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఈ దాడికి దారి తీసిందనే ఫిర్యాాదులు పోలీసులకు అందాయి. వీటిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
ఈ ఉదంతంపై తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ కఠినమైన సమయంలో ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
మహిళల వ్యక్తిత్వ హననం చేసే విధంగా వారు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు మహిళా సమాజంపై వారి అభిప్రాయాలు ఏంటో తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి పోకడలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదని, రాజధాని రైతుల ఉద్యమ సమయంలో కావచ్చు, అమరావతి ప్రాంత మహిళలపై కావచ్చు.. గతంలో ఇలాంటి దాడులు, వ్యాఖ్యలే చేశారని అన్నారు.
స్త్రీలను ఇలాంటి పోకడల ద్వారా బలహీన పరచాలనే ప్రయత్నాలు ఫలించవని అన్నారు నారా భువనేశ్వరి. నేటి తరం మహిళలు వీటిని తట్టుకుని మరింత దృఢంగా ముందుకు సాగుతారు అనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. అవమానకరమైన వ్యాఖ్యలు, ఆత్మగౌరవం దెబ్బతీసే చర్యలతో మహిళల విలువను, స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరని చెప్పారు.
స్త్రీలను గౌరవించే మన సంస్కృతిలో...దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ తిప్పికొట్టాలని భువనేశ్వరి సూచించారు. ఈరోజు, రేపు, ఎప్పుడైనా సరే.. స్త్రీలను కించపరిచే, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలను ఐక్యంగా ఎదిరించి మరింత బలంగా నిలబడదామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications