నారా లోకేష్ కీలక ప్రకటన!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళం ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా న్యాయవాదులతో లోకేష్ కుప్పగల్లులో భేటీ అయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. పరిపాలన అంతా ఒకచోటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేదే తమ పార్టీ విధానమన్నారు.
లాయర్లు నిజనిజాలు గుర్తించాలి: ముఖ్యమంత్రి జగన్ లా తాము మాయమాటలు చెప్పి మోసం చేయమని, రాయలసీమలోనే హైకోర్టు అంటూ ఎన్నాళ్లు మభ్యపెడతారని ప్రశ్నించారు. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, తాము కర్నూలులో ఒక మాట, ఢిల్లీలో మరోమాట చెప్పే ప్రయత్నం చేయబోమన్నారు. నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతున్న జగన్ కర్నూలులో కనీసం ఒక్క ఇటుకైనా పెట్టారా? అని నిలదీశారు. జగన్ చెప్పే అబద్దాలు తియ్యగా ఉంటాయని, తాము చెప్పే నిజాలు చేదుగా ఉంటాయని, న్యాయవాదులు ఇందులోని నిజనిజాలను గుర్తించాలన్నారు.

జూనియర్ లాయర్లకు స్టైఫండ్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ విభాగానికి నిధులతోపాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. న్యాయవాదులవల్లే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అరాచకాలను కొంతవరకైనా అడ్డుకోగలిగామని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. సాయిప్రసాద్ కు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ అని, యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.
ఎమ్మెల్యేకు టీడీపీ నాయకుల సవాల్: వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేరిస్తే తాము స్వాగతిస్తామని, ఒకవేళ తాము భూములు కబ్జా చేస్తే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే వాటిని స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచాలంటూ సవాల్ విసిరారు. ఆదోనిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పమంటే తమ నాయకుడిని విమర్శిస్తున్నారని, టీడీపీపై అనవసర అభాండాలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications