కామారెడ్డి సీటు: షబ్బీర్ అలీ వర్సెస్ గంప గోవర్ధన్
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెసు అధిష్టానం మాజీ మంత్రి షబ్బీర్ అలీని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శాసనసభా నియోజకవర్గంలో పోటీకి దింపింది. తెరాసను ధీటుగా ఎదుర్కునే అభ్యర్థిగా ఆయనను గుర్తించి టికెట్ ఇచ్చింది. షబ్బీర్ అలీపై తెరాస అభ్యర్థిగా ఎమ్మెల్యే గంప గోవర్థన్, బిజెపి అభ్యర్థిగా సిద్ధి రాములు పోటీపడుతున్నారు.
కామారెడ్డి నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా 13 సార్లు సాధారణ, ఒకసారి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది పర్యాయాలు ఎన్నికగా, తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు నాలుగు సార్లు, ఒక సారి స్వతంత్ర అభ్యర్థి, ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి విజయం సాధించారు. ముగ్గురు అభ్యర్థులు కూడా తెలంగాణవాదాన్నే ఆసరా చేసుకుని పోటీ పడుతున్నారు.

తమ పార్టీయే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు తనకు అనుకూలంగా మారుతాయనీ, కామారెడ్డి నియోజవర్గ ప్రజలు తనకు అండగా నిలుస్తారని షబ్బీర్ అలీ భావిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్నికైన రెండుసార్లూ షబ్బీర్ అలీ మంత్రి పదవిని చేపట్టారు. 1989, 2004ల్లో గెలుపొందిన ఆయన 1994, 1999, 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన షబ్బీర్ 2013లో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంప గోవర్దన్ తెలంగాణవాదులపైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1994, 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఆయన 2011లో ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస తరఫున విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తెరాస పార్టీ నుంచి పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆదరిస్తారని ఆయన భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా కామారెడ్డి స్థానాన్ని దక్కించుకున్న బిజెపి ఈసారి కొత్త అభ్యర్థి సిద్ధి రాములును బరిలోకి దించింది. బిజెపి మద్దతుతోనే తెలంగాణ సాధ్యమైందన్న అంశం తమకు అనుకూలిస్తుందని సిద్దిరాములు భావిస్తున్నారు. మిత్రపక్షమైన టిడిపి కార్యకర్తలు చాలా మంది గంప గోవర్దన్‌తో తెరాసలో చేరారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారం లభించడం ఆయనకు కష్టమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications