2019కి సిద్ధం: రోజాకు లోకేష్, నా మనవడి కంటే మీరే ఎక్కువ: బాబు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన పైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు ఘాటుగా స్పందించారు. అదే సమయంలో తన రాజకీయ ఆరంగేట్రం పైన స్పష్టత ఇచ్చారు.
ఆయన ఈ రోజు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. జగన్ తన ఢిల్లీ పర్యటనలో తమ పైన అక్రమాస్తులు అని ఆరోపణలు చేశారని, వాటి పైన తాము చర్చకు సిద్ధమని చెప్పారు. ఏడేళ్లుగా తమ కుటుంబం ఆస్తులను ప్రకటిస్తుందని, మరి జగన్ తన ఆస్తులను ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు.
ఫైబర్ గ్రిడ్ పెట్టుబడే రూ.350 కోట్లు అయితే అందులో రూ.1400 కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఎవరి అక్రమాస్తులు తెరపైకి వచ్చినా అందులో మాకు సంబంధం ఉందని జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.

జగన్‌కు ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు
ఢిల్లీలో వైసిపి అధినేత, ఆయన పార్టీ నేతలకు ఎవరూ ఆపాయింటుమెంట్ ఇవ్వలేదని లోకేష్ అన్నారు. అందర్నీ కూడా జగన్ పార్లమెంటు సెంట్రల్ హాలులో కలిశారని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో కేవలం ఎమ్మెల్యేలే చేరడం లేదని, ఇతర పార్టీలకు చెందిన, వైసిపికి చెందిన నేతలు కూడా వస్తున్నారని చెప్పారు.
2019కి సిద్ధంగా ఉన్నా
తాను 2019 ఎన్నికల నాటికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేరుతానన్న వార్తల పైన కూడా లోకేష్ స్పందించారు. తాను మంత్రివర్గంలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే, 2019కి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
బుధవారం నాడు విశాఖ పర్యటనలో అవినీతిపై చర్చకు సిద్ధమా అని వైసిపిని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు రోజా తన గురించి, టిడిపి గురించి మాట్లాడగానే లోకేష్ వెంటనే స్పందించారు. రోజాకు, జగన్‌కు, వైసిపికి కౌంటర్ ఇచ్చారు. తాను బుధవారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, చర్చకు సిద్ధమని చెప్పారు.
అన్నీ వదులుకున్నా: చంద్రబాబు
ప్రజల కోసం తాను అన్నీ వదులుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు గురువారం అన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టిడిపిలో చేరిన సమయంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజాసంక్షేమం కోసం తాను అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు.
లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, వారి మాటల్లో నిజంలేదన్నారు. శ్రీశైలాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాయలసీమలో కరవు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాయలసీమ నీటి కష్టాలు తీరుస్తామన్నారు
రాయలసీమను రతనాల సీమగా మారుస్తానన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించకుండా తమపై విమర్శలు చేస్తున్నాయన్నారు. నాకు నా మనవడిని చూడాలనిపించినా వెళ్లడం లేదని, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగాలు చేశానని చెప్పారు. ఈ రోజున నా మనవడిని చూడటం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications