చంద్రబాబుతో విభేదించిన నారా లోకేష్: మతలబు ఏమిటి?
నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడితో విభేదించినట్లు కనిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు ఉద్దేశం అది కాదని ఎందుకు చెప్పారనే విషయంపై చర్చ సాగుతోంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ విభేదించారు. 2019 చివరలో రావాల్సిన ఎన్నికలు 2018 నవంబర్‌లోనే వస్తాయని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.
ఎన్నికలకు సిద్ధపడాలని కూడా ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జమిలి ఎన్నికలకు, లేదంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ రెండు విషయాల్లోనూ నారా లోకేష్ చంద్రబాబు విభేదించారు.
చంద్రబాబుతో నారా లోకేష్ విభేదించడంలోని ఆంతర్యం ఏమిటనే విషయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నారా లోకేష్ చంద్రబాబు వారసుడిగా ముందుకు వచ్చిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ, చంద్రబాబును కాదని ఆయన ముందుకు వెళ్తారా అనేది ఊహించలేని విషయమే అయినప్పటికీ చర్చ మాత్రం కొనసాగుతోంది.

నారా లోకేష్ అసలు ఏమన్నారు...
ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెప్పలేదని నారా లోకేష్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మాత్రమే చంద్రబాబు చెప్పినట్లు ఆయన తెలిపారు. అయినా, ఏడాది ముందుగా ఎన్నికలు పెడతామంటే ఏ రాష్ట్రం మాత్రం అంగీకరిస్తుందని ఎదురు ప్రశ్న వేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపు అని ఆయన ముక్తాయింపు ఇచ్చారు. అదే సమయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యపడేది కాదని నారా లోకేష్ చెప్పారు.

ఆ విషయంపై చంద్రబాబు మాట్లాడారా...
దేశమంతా ఒకేసారి ఎన్నికలు పెట్టాలనే బిజెపి ఆలోచనపై చంద్రబాబు అధికారిక ప్రకటన చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని గానీ బిజెపిని గానీ వ్యతిరేకించే స్థితిలో చంద్రబాబు లేరనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం నుంచి గానీ బిజెపి నుంచి ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు చూద్దామనే ఉద్దేశంతో ఆయన ఉండి ఉండవచ్చు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలో మాత్రం ఆయన సానుకూలంగా ప్రతిస్పందించినట్లు వార్తలు వచ్చాయి. ఈ స్థితిలో అర్థాంతరంగా నారా లోకేష్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎందుకన్నారనేది తెలియడం లేదు.

పట్టుబట్టి నారా లోకేష్ అలా...
నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి నారా లోకేష్ మంత్రి పదవిని చేపట్టినట్లు ప్రచారం జరిగింది. నారా లోకేష్ కోసమే ఆయన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించారనే మాట కూడా వినిపించింది. అయితే, నారా లోకేష్‌ను తన వారసుడిగా ముందుకు తెచ్చే ప్రయత్నంలో చంద్రబాబు చాలా మందిని దూరం పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెట్టడంలో ఆయన ఉద్దేశం అదే. అయితే, నారా లోకేష్ చంద్రబాబు అనుకున్నదాని కన్నా ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి లోకేష్...
వచ్చే ఎన్నికల నాటికి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. టిడిపి సీనియర్ నేతలు కూడా నారా లోకేష్‌ను వ్యతిరేకించడం లేదు. పైగా, వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది నారా లోకేషేనని ప్రకటించినవారు కూడా ఉన్నారు. చంద్రబాబు పక్కకు జరిగి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించడానికి సిద్దంగా ఉన్నారా అనేది చెప్పలేం. అదే సమయంలో మరింత దూకుడుగా ముందుకు సాగి తానే అన్ని ప్రకటించుకునేందుకు నారా లోకేష్ ఉవ్విళ్లూరుతున్నారా అనేది కూడా ఇప్పుడే చెప్పలేం.

ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు మౌనం...
ముందస్తు ఎన్నికలు ఉంటాయని తాను అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, దానిపై చర్చ జరుగుతున్నప్పటికీ చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు. తాను అలా అనలేదనే విషయం చెప్పలేదు. నిజానికి, ఏదైనా విషయాన్ని ముందుకు తెచ్చి, దానిపై చర్చ జరిగే విధంగా చూడడం చంద్రబాబుకు అలవాటు. తన ప్రకటనపై చర్చ జరగాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. కానీ నారా లోకేష్ చంద్రబాబు ఉద్దేశం అది కాదని చెప్పేశారు. ఇది దేనికి సంకేతమనే ప్రశ్న వస్తోంది.












Click it and Unblock the Notifications