సీమలో టిడిపి రికార్డ్, వీరేం చేస్తారంటే..: నారా లోకేష్ కీ రోల్
విజయవాడ: రాయలసీమవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఆరువేల మందితో కూడిన సుశిక్షిత సైన్యం ఉంది. ఏడాదిలో వీరిని శిక్షణా కేంద్రం తీర్చిదిద్దింది. ఇది రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి రికార్డ్ అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి, వారిని మెప్పించే సైన్యం ఇది.
క్షేత్ర స్థాయిలో పథకాల అమలు తీరును ప్రభుత్వానికి, పార్టీ శ్రేణుల తీరుతెన్నులను అధిష్టానానికి చేరవేసి లోటుపాట్లను సరిదిద్దుకునేలా చేయడం కూడా వీరి బాధ్యత. ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీ శ్రేణులకు వీరు సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. తిరుపతిలోని టిడిపి ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో వీరి సిద్ధమయ్యారు.
రాయలసీమ జిల్లాల పరిధిలోని కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 11వ తేదీతో ఏడాది గడిచింది. ఈ వ్యవధిలో తిరుపతి కేంద్రం 87 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేసి ఆరువేల రెండు వందల మందిని మలచింది.

లోకేష్ ముద్ర కోసం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, పార్టీ జాతీయ కన్వీనర్ నారా లోకేష్ పార్టీ పైన తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలతో పాటు కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు పలు అంశాల్లో లోకేష్ తానేమిటో నిరూపించుకున్నారు.
అలాగే, సంస్థాగతంగా చురుకైన కార్యకర్తలకు రాజకీయ, పాలనా వ్యవహారాలపై మంచి శిక్షణ ఇవ్వాలని, వారితో పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి గ్రామాల్లో ప్రచారం చేయించేలా కార్యక్రమం రూపొందించాలని లోకేష్ భావించారు. ఇందుకోసం ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రాయలసీమ జిల్లాల కోసం ఉద్దేశించిన తిరుపతి ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని గతేడాది సెప్టెంబరు 11న ప్రారంభించారు. ప్రతి బ్యాచ్‌లోనూ శిక్షణానంతరం వివిధ అంశాలపై ప్రసంగ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు. పార్టీ యువనేత లోకేశ మూడుసార్లు శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఇతర నేతలు పలుమార్లు సందర్శించారు.
రాయలసీమవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఆరువేల మందితో కూడిన సుశిక్షిత సైన్యం ఉంది. ఏడాదిలో వీరిని శిక్షణా కేంద్రం తీర్చిదిద్దింది. ఇది రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి రికార్డ్ అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి, వారిని మెప్పించే సైన్యం ఇది.












Click it and Unblock the Notifications