మీ కష్టాలను కళ్లారా చూశా.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : నారా లోకేష్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు గత వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు మంత్రి నారా లోకేష్. ఉన్న పరిశ్రమలను కూడా తమిరికొట్టిన చరిత్ర వారిదని ఆరోపించారు. జగన్ పాలనలో ఒక్క కొత్త కంపెనీ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రూ. 8 లక్ష కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.
ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ (సీబీజీ)కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటేనే ప్రేమ, పౌరుషానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్నారు. 2019లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జిల్లా నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తు చేశారు. అంతేకాదు, 2024 ఎన్నికల్లో ఏకంగా పది స్థానాల్లో విజయాన్ని అందించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

'యువగళం' పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను స్వయంగా చూశానని లోకేష్ పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని ఎంతగా వెనక్కి నెట్టిందో ప్రత్యక్షంగా అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధివైపు దూసుకెళ్తోందన్నారు. ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగానే రాష్ట్రంలో బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని లోకేష్ అన్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.
ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఒక కీలకమైన ముందడుగు కానుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ ఏకంగా రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణ అనుకూలమైన హరిత విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications