భువనేశ్వరి యాత్రలో పవన్ - బీజేపీతోనే చిక్కు, కీలక నిర్ణయాలు..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీలో అనిశ్చితి కనిపిస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల కార్యాచరణ ఫిక్స్ చేసారు. పొత్తు ప్రకటన తరువాత క్షేత్ర స్థాయిలో మార్పు మొదలైంది. ఈ సమయంలో నారా లోకేశ్ - పవన్ కల్యాణ్ భేటీ కీలకంగా మారుతోంది. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో అంతు చిక్కని సమయంలో రెండు పార్టీలు కలిసి ముందు సాగే అంశం పై నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
కలిసి సాగుదాం : చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. అటు తెలంగాణలో అన్ని పార్టీలు ఎన్నికలు కదనరంగంలోకి దిగాయి. అక్కడ టీడీపీ, జనసేన ప్రణాళికలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటు ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల కోసం ప్రజల మధ్యకు వెళ్తోంది. మార్చి వరకు పార్టీ నేతలకు సీఎం జగన్ కార్యాచరణ ఫిక్స్ చేసారు.

చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేశ్ యువగళం ఆగిపోయింది. ఇప్పుడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి నినాదంతో యాత్ ప్రారంభించనున్నారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకు బాబు ష్యూరిటీ..భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని లోకేశ్ నిర్వహించాలని నిర్ణయించారు. వీటి పైనే ప్రస్తుతం పార్టీ నేతలతో లోకేశ్ సమావేశం నిర్వహిస్తున్నారు.
అంతు చిక్కని బీజేపీ వ్యూహం: ఇక, జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణకు లోకేశ్ సిద్దమయ్యారు. ఈ నెల 23న రాజమహేంద్రవరంలో లోకేశ్ - పవన్ అధ్యక్షతన రెండు పార్టీల సమన్వయ సమావేశం జరగనుంది. వైసీపీ ప్రభుత్వం పై ఉమ్మడి పోరు కొనసాగించే క్రమంలో భాగంగా కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. ఏ అంశం పైన కలిసి ముందుకు వెళ్లాలనే దాని పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
టీడీపీ నేతలతో ఈ రోజు జరుగుతున్న సమావేశంలో భువనేశ్వరి నిర్వహించే నిజం గెలవాలి యాత్ర ప్రారంభంలో పవన్ హాజరు అవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భువనేశ్వరి, లోకేశ్ యాత్రల్లో జనసైనికులు పాల్గొంటారని.. పవన్ వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని ఈ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

భువనేశ్వరి యాత్రలో పవన్ : తెలంగాణలో జనసేన తో ఎన్నికల్లో మద్దతు లేదా పొత్తు దిశగా బీజేపీ ఆలోచన చేస్తోంది. టీడీపీ గురించి మాత్రం ప్రస్తావన లేదు. దీంతో, జనసేన - బీజేపీ నిర్ణయం వచ్చిన తరువాత తెలంగాణలో పోటీ పైన టీడీపీ తమ వైఖరి వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లోగా ముందుగా రెండు పార్టీల కేడర్ కలిసి పని చేసేలా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు ఉండేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
అదే విధంగా ప్రతీ జిల్లాలోనూ రెండు పార్టీల నేతలతో ఉమ్మడి సమావేశాలకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రెండు పార్టీలతో బీజేపీ భిన్నంగా వ్యవహరిస్తున్న సమయంలో ఏ రకంగా వ్యవహరించాలి.. వైసీపీ ని ఏ రకంగా ఎదుర్కోవాలనేది ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications