తిరుపతిలో పోటీ చేయను, దేవుడిదే నిర్ణయం: నారా లోకేష్
మచిలీపట్నం: త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ కుటుంబసభ్యులే పోటీకి అర్హులని అన్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మచిలీపట్నం వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఏదైనా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే చనిపోతే ఆనవాయితీ ప్రకారం ఆ కుటుంబానికి చెందిన వ్యక్తితోనే ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, తిరుపతి ఉప ఎన్నిక కూడా అలాగే ఉంటుందన్నారు. 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా, తన రాజకీయ ప్రవేశం ఆ దేవుడే నిర్ణయిస్తాడని ఆయన దాటవేశారు. ప్రస్తుతం తాను పార్టీకి విధేయుడనై పని చేస్తున్నానన్నారు. రుణమాఫీ విషయంలో రైతులెక్కడా ధర్నాలు చేయడం లేదని, ధర్నాలు చేసే వారంతా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ వారేనని లోకేష్ విమర్శించారు.

జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన నారా లోకేష్ సోమవారం గన్నవరం విమానాశ్రయంలో జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు లోకేష్‌ను సత్కరించారు. అర్బన్ టీడీపీ అధ్యక్షులు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులు లోకేష్‌కు దుశ్శాలువా కప్పి స్వాగతం పలికారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు నూతలపాటి నాగభూషణం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నర్రా అరుణ్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి బొప్పన రంజిత్, అర్బన్ తెలుగు యువత అధ్యక్షులు దేవినేని చంద్రశేఖర్, జిల్లా నాయకులు సంకర నవ్యంత్ చౌదరి, గుమ్మడి ఫణిదీప్, షేక్ అన్సారి, ఉల్లాస శివయాదవ్, సుంకర నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు.
సోమవారం ఉదయం నారా లోకేష్ స్పైస్ జెట్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యేలు, దాసరి బాలవర్థనరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, పార్టీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడు, తెలుగు యువత నాయకులు దేవినేని చంద్రశేఖర్, ఓలుపల్లి మోహనరంగా, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, నాయకులు నాగుల్‌మీర, రావి వెంకటేశ్వరరావులు ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications