నీది ప్రిజనరీ బుద్ధి, చంద్రబాబుది విజనరీ , జేబులు కొట్టే జగన్ సర్కార్ కు ఓట్లు అడిగే అర్హత ఉందా ? : లోకేష్ ఫై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ అర్హతతో తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్.

సంక్షేమం పేరుతో ప్రజలను ఓట్లు అడిగే అర్హత ఉందా అని విమర్శలు
జేబులు కొట్టే ఈ సిగ్గుమాలిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి సంక్షేమం పేరుతో ప్రజలను ఓట్లు అడిగే అర్హత ఉందా అంటూ విమర్శలు గుప్పిస్తున్న నారా లోకేష్ జె టాక్స్ ఉగ్రవాదం ప్రజల జేబులు ఖాళీ చేస్తూనే ఉందని విమర్శించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, అన్ని రాష్ట్రాల కంటే మరోసారి ద్రవ్యోల్బణం లోకి ఏపీ నే ఎక్కువగా చిక్కుకుందని విమర్శించారు. అందుకు సంబంధించి కేంద్రం ఇచ్చిన డేటాను సోషల్ మీడియాలో షేర్ చేశారు .

ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వారి జేబులో నుంచి వంద రూపాయలు లాగేస్తున్న జగన్ సర్కార్
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు కారణమని నారా లోకేష్ మండిపడ్డారు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వారి జేబులో నుంచి వంద రూపాయలు లాగేస్తున్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిగ్గు లేని పిక్ పాకెట్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు .
ఇక నిన్నటికి నిన్న చంద్రబాబు గారి సభలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక రౌడీ మూకలతో రాళ్ల దాడి చేసి రెండోసారి ఓటమిని ఒప్పుకున్నారు వైయస్ జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు .

నీది ప్రిజనరీ బుద్ధి ... చంద్రబాబుది విజనరీ
ఇదే సమయంలో నీలాంటి ఫ్యాక్షన్ కుక్కమూతి పిందెలు వేసే రాళ్లు ఆయనను భయపెట్ట లేవని మండిపడ్డారు. జగన్ నీ ప్రిజనరీ బుద్ధితో రాళ్ళువేయిస్తే అదే రాళ్లతో జనానికి పనికొచ్చే ఒక నిర్మాణం చేయించగల విజనరీ చంద్రబాబు గారు అంటూ లోకేష్ పేర్కొన్నారు. తిరుపతి లో నా సవాల్ కి తోకముడిచి తొలి ఓటమిని అంగీకరించారు. ఇప్పుడు రెండోమారు రౌడీ మూకలతో రాళ్ల దాడి చేయించి ఓటమిని అంగీకరించారని లోకేష్ పేర్కొన్నారు.

మండుపాతరలకే భయపడని గుండె ధైర్యం చంద్రబాబుది
చంద్రబాబు మందు పాతరలకే భయపడలేదని తిరుపతి కొండ పైన స్మగ్లర్లు తీవ్రవాదులతో కలిసి 24 క్లెమోర్ మైన్లు పెట్టి పేల్చితే సాక్షాత్తు ఏడుకొండలవాడు కాపాడిన ప్రాణం చంద్రబాబు గారిదని , ఏ ఒక్కరు బతికే అవకాశం లేని దాడి నుంచి తేరుకుని సహచరులు ఎలా ఉన్నారు అని వాకబు చేసిన గుండె ధైర్యం చంద్రబాబు గారిదని లోకేష్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈరోజు ఉగాది నాడు కూడా లోకేష్ తన మాటల దాడిని కొనసాగించారు. సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications