నారా లోకేష్ గేమ్ స్టార్ట్- అమరావతి కేంద్రంగా..!!
Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అమరావతి నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. అన్ని రంగాల్లో దీన్ని పురోగమింపజేయడానికి చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా- మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ, స్టేడియానికి ఆర్థిక సహకారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలను అందజేశారు.

ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పర్యటన కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. కొద్దిసేపటి కిందటే కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియాతో సమావేశం అయ్యారు.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ తీర్చిదిద్దడానికి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. క్రీడా పాలసీని కూడా అమలు చేస్తోన్నామని అన్నారు.
ఈ విధానానికి అనుగుణంగా అమరావతిలో ఈ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో గ్రామస్థాయిలో సరైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోన్నామని, ఫలితంగా క్రీడల్లో పాల్గొంటోన్న యువత సంఖ్య 15 శాతానికి పెరిగిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2024 అధ్యయనం వెల్లడించిందని గుర్తు చేశారు.
దీన్ని బట్టి చూస్తే- రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఓ స్పోర్ట్స్ సిటీని నిర్మించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంలో గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని నారా లోకేష్ చెప్పారు. దీనికి అనుగుణంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మన్ సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని, అలాగే క్రీడా శిక్షణ, సౌకర్యాలను అందించడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో అథ్లెట్లకు ఎంతో దోహదం చేసినట్టవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications