నిన్న పవన్- రేపు నారా లోకేష్..!!
Daaku Maharaj: ఇంకొద్ది రోజుల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది.
సంక్రాంతి సినిమాల కోలాహలం..
ఇక కొత్త సినిమాలకు కొదవ ఉండట్లేదు. స్టార్ హీరోలు నటించిన మూవీలు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. థియేటర్లను ముంచెత్తనున్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌లో మూడు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతి రేసులో పోటీ పడుతోన్నాయి.

10న గేమ్ ఛేంజర్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోంది. 300 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన మూవీ ఇది. ఎస్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమవరంలో ముగిసింది కూడా.
చీఫ్ గెస్ట్‌గా పవన్..
దీనికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ హాజరయ్యారు. తన సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు నటించిన సినిమా కావడం వల్ల ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గేమ్ ఛేంజర్ సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.
12న డాకు మహారాజ్..
ఇక నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహరాజ్. ఈ నెల 12వ తేదీన థియేటర్లలోకి రానుంది. బాబీ కొల్లి దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవితో తీసిన వాల్తేరు వీరయ్య తరువాత ఆయన దర్శకత్వంలో రాబోతోన్న మూవీ ఇదే కావడం, దీని టైటిల్, బాలయ్య గెటప్ కొత్తగా ఉండటం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

ఎన్నో అంచనాలు..
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, పాయల్ రాజ్‌పుత్, ఊర్వశి రౌతెలా, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, రోనిత్ రాయ్ నటించిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్య నటించిన మూవీ ఇదే కావడం వల్ల అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది.
14న వెంకి మూవీ..
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ పేరుకు తగ్గట్టే పండగ రోజున అంటే 14వ తేదీన విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, సాయికుమార్.. ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొందీ మూవీ.

అనంత వేదికగా..
కాగా డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అనంతపురంలో నిర్వహించబోతోంది చిత్రం యూనిట్. ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించింది కూడా. ఈ నెల 9వ తేదీన సాయంత్రం అనంతపురం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ ప్రోగ్రామ్ జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
చీఫ్ గెస్ట్‌గా నారా లోకేష్..
ఈ ఈవెంట్‌కు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మామ బాలయ్యతో కలిసి వేదికను పంచుకోనున్నారాయన. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత నారా లోకేష్ ఓ సినీ కార్యక్రమానికి హాజరు కాబోతోండటం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications