లోకేశ్ యువగళం కు బ్రేక్ - ఆకస్మిక నిర్ణయం వెనుక..!!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక, ఇప్పుడు ఏపీలో రాజకీయం పైన ఆసక్తి పెరుగుతోంది. తెలంగాణ ఫలితాలు ఏపీలో ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ మొదలైంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో సీఎం జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇటు నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
యాత్రకు బ్రేక్: తెలుగుదేశం కీలక నేత నారా లోకేశ్ తన యువగళం యాత్రకు విరామం ప్రకటించారు. లోకేశ్ తన యాత్రలో భాగంగా 215వ రోజు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని యూ కొత్తపల్లి మండలం శీలంవారి పాకలు గ్రామంలో దళిత గలం బహిరంగ సభలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు.

చంద్రబాబు అరెస్ట్ తో ఆగిన పాదయాత్ర తిరిగి నవంబర్ 27న ప్రారంభమైంది. ఈ నెల 17న విశాఖలో భీమిలి వద్ద యాత్ర ముగించేలా తొలుత నిర్ణయించారు. అక్కడ ముగింపు సభకు చంద్రబాబు, పవన్ హాజరవ్వాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు మరోసారి లోకేశ్ యాత్ర కు బ్రేక్ పడింది. ఈ మేరకు లోకేశ్ కీలక ప్రకటన చేసారు.
ప్రజలకు పిలుపు: ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు కారణంగా పాదయాత్రకు మూడు రోజుల విరామం ప్రకటించారు. తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారి పాకల నుంచి యువగళం ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ సమయంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సహాయకచర్యల్లో టిడిపి నేతలు-కార్యకర్తలు పాల్గొనాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకి విరామం ప్రకటించానని తెలిపారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మారుతున్న లెక్కలు: సురక్షిత ప్రదేశాలలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని కోరారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా మొబైల్ ఫోన్లు చార్జింగ్ ఉంచుకోవాలని, శిథిల భవనాలలో అస్సలు ఉండొద్దని హెచ్చరించారు. టిడిపి కేడర్ స్వచ్ఛందంగా తుఫాన్ సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఇక, కేంద్రంలో మరోసారి ముందస్తు ఎన్నికల ప్రస్తావన రావటంతో ఏపీలోని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. మరో మూడు నెలల కాలంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేలా వ్యూహాల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఫలితాలతో ఏపీలో ఎలాంటి ఫలితం వస్తుందనే అంచనాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications