జగన్ పార్టీ, నామా: ఖమ్మం లోకసభ అభ్యర్థి నారాయణ!

ఆర్థికంగా శక్తివంతులైన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల నామా నాగేశ్వర రావు, శ్రీనివాస్ రెడ్డిలను ఎదుర్కోవాలన్నా, కాంగ్రెసు ఓటు బ్యాంకు సక్రమంగా తమకు బదలి కావాలన్నా ఆ పార్టీ తరఫున ముఖ్యమైన అభ్యర్థినే ఎంపిక చేయాలని సిపిఐ జిల్లా నేతలు యోచిస్తున్నారు. దీనికి సరైన అభ్యర్థి నారాయణే అన్న అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ పోటీ చేయాలని జిల్లా సమితి సమావేశంలో తీర్మానం చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తీర్మానాన్ని రాష్ట్ర, జాతీయ కమిటీలు ఆమోదిస్తేనే నారాయణ అభ్యర్థి అవుతారు. మరోపక్క సిపిఐ రెండు కమిటీలుగా ఏర్పాటైతే తెలంగాణకు చాడ వెంకటరెడ్డి, సీమాంధ్ర రాష్ట్రానికి కె రామకృష్ణ కార్యదర్శులుగా ఎన్నికయ్యే అవకాశం ఉందని, నారాయణను కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పార్లమెంటుకు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెసు పార్టీతో పొత్తులో భంగాగా ఒక లోకసభ స్థానం, పది అసెంబ్లీ స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా ఉందని సిపిఐ నేతలు చెబుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలు గతవారం పలుమార్లు సమావేశమై నియోజకవర్గాల విషయంలో జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయంటున్నారు.
సిపిఐ జాతీయ నాయకత్వం సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. తమ కూటమిలో తెరాస సైతం చేరితే మరింత మంచిదని, ఈ మూడు పార్టీలే తొలి నుండి తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకిత భావంతో పని చేశాయని, చివరికి మూడు పార్టీలు కలిసి పనిచేయడం కోసం సిపిఐ తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ చెప్పారు.
నియోజకవర్గాలపై పీడముడి
సిపిఐకి పది అసెంబ్లీ స్థానాలు, ఖమ్మం లోక్‌సభ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినా, దేవరకొండ , హుస్నాబాద్, మునుగోడు నియోజకవర్గాలపై ఇంకా పీటముడి వీడలేదని సిపిఐ నేతలు చెబుతున్నారు. ఈ మూడు సీట్లు కావాలని సిపిఐ పట్టుబడుతుంటే, ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించడం లేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వార్‌రూమ్‌లో సమావేశం అయిన తర్వాత తిరిగి 7 గంటలకు మరోమారు ఢిల్లీలో సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications