పవన్ కళ్యాణ్ స్ఫూర్తి, చంద్రబాబు రావాలి: మోడీ
హైదరాబాద్: సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే, సర్ణాంధ్ర కావాలంటే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రావాలని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తన మనస్తత్వం చంద్రబాబు మనస్తత్వం ఒక్కటేనని, ఇద్దరం కూడా అభివృద్ధి గురించే ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తనను కలిశాడని, పవన్ కళ్యాణ్‌లో తెలుగు స్ఫూర్తి కనిపించిందని, యువత స్ఫూర్తిని అది ప్రతిబింబించిందని, పవన్ కళ్యాణ్ తన హృదయాన్ని తట్టాడని మోడీ అన్నారు.
తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేదికను పంచుకున్నారు. ఈ ఎన్నికలు దేశానికి ప్రభుత్వాన్ని ఎన్నుకునేవి మాత్రమేనని, సీమాంధ్రకు మాత్రం భవిష్యత్తును తీర్చిదిద్దుకునేవని ఆయన అన్నారు. సీమాంధ్ర ముందు రెండే అవకాశాలున్నాయని, స్వర్ణాంధ్ర కావాలా, స్కామాంధ్ర కావాలా అనేది నిర్ణయించుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. భవ్యవమైన సీమాంధ్రను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే తాను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మీరు మెతకదనం ప్రదర్శిస్తే కేంద్ర ప్రభుత్వం ఎంత చేసినా సురక్షితం కాదని, భవ్యమైన, దివ్యమైన భవిష్యత్తు కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలపై వెంకయ్యనాయుడు పార్లమెంటులో పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. గుజరాత్ అనుభవంతో తాను చెబుతున్నానన, దానికన్నా బాగా అభివృద్ధి చేసుకునే సత్తా సీమాంధ్రకు ఉందని ఆయన అన్నారు. గుజరాత్ విడిపోయినప్పుడు ఏమీ లేవన్నారు, అభివృద్ధే జరగదని అన్నారని, ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని, గుజరాత్ కన్నా బాగా తాను సీమాంధ్రను అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు. గుజరాత్‌లో ఆంధ్రులున్నారని, వారి శక్తి ఏమిటో తనకు తెలుసునని ఆయన అన్నారు.

సీమాంధ్రలో అపారమైన చమురు నిక్షేపాలున్నాయని వాటిని వెలికి తీస్తే భారతదేశానికే వెలుగును అందించవచ్చునని, అందుకు దోహదపడే ప్రభుత్వం ఢిల్లలో ఉండాలని ఆయన అన్నారు. ఆంధ్రులు శిక్షణ పొందడానికి గుజరాత్ పెట్రోలియం విశ్వవిద్యాలయం తలుపులు తెరిచే ఉంటాయని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను చంద్రబాబు సాఫ్ట్‌వేర్ కేంద్రంగా మార్చారని, సీమాంధ్రను హార్డ్‌వేర్ కేంద్రంగా మలుస్తామని ఆయన చెప్పారు.
తనపై గుజరాత్‌లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదని, వ్యక్తిగత జీవితంలో గానీ రాజకీయ జీవితంలో గానీ ఒక్క కేసు కూడా లేదని, మొదటి సారి తనపై కేసు నమోదైందని, కమలాన్ని ప్రదర్శించినందుకు తనపై కేసు పెట్టారని ఆయన అన్నారు. ఓటర్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్లిన తర్వాత కమలానికి, సైకిల్‌కు ఓటు వేయాలని ఆయన సూచించారు.
తాను లంచం తినను, తిననివ్వనని ఆయన చెప్పుకున్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే కేవలం 18 మంది పేర్లను మాత్రమే అమ్మాకొడుకుల ప్రభుత్వం బయటపెట్టిందని ఆయన అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే నల్ల ధనాన్ని విదేశాల నుంచి తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెసు కుట్రపూరితంగా తనపై ఎన్నో ఆరోపణలు చేసిందని, తాను నిష్కల్మషంగా బయటకు వచ్చానని అన్నారు.
సీమాంధ్రలో నిర్మించే రాజధాని ముందు ఢిల్లీనగరం కూడా చిన్నబోవాలని మోడీ అన్నారు. చంద్రబాబు అటువంటి రాజధానిని నిర్మించాలని కోరుతున్నానని ఆయన అన్నారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం కూడా రాయలసీమ లాంటిదేనని, ఆ ప్రాంతానికి పెద్ద పెద్ద పైపులైన్లు వేసి నీరందించామని, ఢిల్లీలోని అమ్మాకొడుకులు మారుతి కారులో కూర్చోని ఆ పైపుల గుండా వెళ్లవచ్చునని, పాకిస్తాన్ సరిహద్దు వరకు నీరు అందిస్తున్నమని, దాంతో ఇప్పుడు కచ్ ప్రాంతం కూరగాయల వంటివి పండించి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోందని ఆన అన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీరు అందేలా చూస్తామని ఆయన అన్నారు.
సీమాంధ్రకు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందని, తనకు అవకాశం ఇస్తే సీమాంధ్ర రూపురేఖలు మారుస్తానని అన్నారు విశాఖ కేంద్రంగా రక్షణ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు. యుద్ధంలో, ఉగ్రవాదుల దాడుల్లో సంభవించిన మరణాల కన్నా ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెసు ప్రభుత్వం దేశ వ్యవసాయ, రక్షణ రంగాలను నాశనం చేసిందని మోడీ అన్నారు. సీమాంధ్రలోని చమురు నిక్షేపాలు వెలికి తీసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కుంభకోణాలకు పాల్పడేవారికి అవకాశం ఇస్తే భవిష్యత్తు ఉండదని అన్నారు.












Click it and Unblock the Notifications