పోలీసుల అదుపులో నవ్యాంధ్ర న్యూస్ చానెల్ ఎండి
నెల్లూరు: నవ్యాంధ్ర న్యూస్ చానల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్‌ను నెల్లూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు దొంగతనాల కేసులు నమోదు కావడంతో రెండురోజుల క్రితం ఒంగోలులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. గుంటూరు కేంద్రంగా నవ్యాంధ్ర టీవీ చానల్‌ను ఆయన ప్రారంభించారు.
ఆ చానెల్‌లో విలేకరులుగా అవకాశం కావాలంటే సంస్థకు రూ.2 లక్షలు చెల్లించాలని షరతులు విధించేవారు. 13 జిల్లాలతో పాటు గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో అదనపు విలేకర్లను నియమించుకుని లక్షలు వసూలు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

ఆరు నెలల క్రితం నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రూ.2 లక్షలు, మంగళసూత్రం, సజ్జాపురంలోని మరో ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం అపహరించుకుపోయినట్లు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ ఘటనకు ముందు భక్తవత్సలనగర్ ప్రాంతంలోని కృష్ణమందిరంలో ఆరు మంగళసూత్రాలతో పాటు కొంత నగదు, బంగారం తీసుకెళ్లినట్లు పోలీసుల రికార్డులో ఉంది.
రామ్మూర్తినగర్ ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పని చేస్తూ నగదు అపహరించుకుపోగా దాని నిర్వాహకులు ఇప్పటికీ ఇతని కోసం గాలిస్తున్నారు. ఈ ఫిర్యాదులతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు సునీల్ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టి ఒంగోలులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications