విద్యార్ధులకు నో బ్యాగ్ డే - అకడమిక్ కేలండర్ రిలీజ్: సెలవులు -క్లాసులు ఎప్పుడెప్పుడు..!!
ఏపీలో జూలై 5వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తొలుత జూలై 4వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించినా..5వ తేదీకి మార్పు చేసారు. ఇక, 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా అకడమిక్ కేలండర్ విడుదల చేసింది. ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది మాత్రం జులై 5 నుంచి పునఃప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో పాఠశాలలు 220 రోజులు పని చేస్తాయి.

వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే
పాఠశాలలకు ఉండే మూడు స్థానిక సెలవులను వినియోగించుకుంటే వాటికి బదులు అదే నెలలో రెండో శనివారం, ఆదివారాల్లో బడులు నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాల నిర్వహణలో పీరియడ్లు..ఆటలు..రివిజన్ తరగతుల పైన ఇందులో స్పష్టత ఇచ్చారు. వారంలో ఒక రోజు 'నో బ్యాగ్ డే' ఉంటుందని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) విడుదల చేసిన కేలండర్ లో స్పష్టం చేసారు. 1-9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయి. సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38 నుంచి 39 పిరియడ్లు బోధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

స్కూళ్లు - పిరీయడ్ల నిర్వహణ
1-5 తరగతులకు మొదటి 40రోజులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి వరకు 30రోజుల పాటు విద్యార్థులను సంసిద్ధం చేసే కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ప్రీ ప్రైమరీ.. ఒకటి రెండు తరగతులు ఉండే ఫౌండేషన్, 1-5 తరగతుల ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు, పునశ్చరణ తరగతుల నిర్వహణ పైన నిర్ణయాలను పాఠశాలలకే వదిలిపెట్టారు.

సెలవులు ఎప్పుడెప్పుడు
ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6వరకు దసరా సెలవులుగా ఖరారు చేసారు. డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటి వరకు క్రిస్మస్ సెలవులుగా నిర్దారించారు. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయని కేలండర్ లో స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications