కూటమిలోకి వాసిరెడ్డి ఎంట్రీకి బ్రేకులు, వాట్ నెక్స్ట్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. రాజకీయంగా.. పాలనా పరంగా కొత్త నిర్ణయాలకు కూటమి నేతలు సిద్దం అవుతున్నారు. అటు మాజీ సీఎం జగన్ సీఎం చంద్రబాబు లక్ష్యంగా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో కూటమి పార్టీల్లో చేరికల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ నుంచి వలసలు దాదాపు ఆగిపోయాయి. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నేతలకు కూటమిలో ఎంట్రీ సులువుగా దొరకటం లేదు. తాజాగా వాసిరెడ్డి పద్మ కూటమి పార్టీల్లో చేరిక విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వాసిరెడ్డి పద్మ వైసీపీలో కీలకంగా పని చేసారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. అధికారం లోకి వచ్చిన తరువాత పార్టీ వాయిస్ బలంగా వినిపించారు. జగన్ ముఖ్యమంత్రి అయిత తరువాత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి తరువాత వాసిరెడ్డి పద్మ పార్టీ వీడారు. 2024 ఎన్నికల సమయంలో పద్మ వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే, అవకాశం దక్కలేదు. ఇక.. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు. తొలుత వాసిరెడ్డి పద్మ జనసేనలో చేరేలా ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం సాగింది. అయితే, సామినేని ఉదయభాను జనసేనలో చేరటం తో వాసిరెడ్డి పద్మను పార్టీలో చేరటం ఆగిపోయింది. కొంత కాలంగా కూటమి పార్టీలకు మద్దతుగా జగన్ పైన తీవ్ర స్థాయిలో చర్చల్లో విమర్శలు చేస్తున్నారు.

జనసేనలో అవకాశం లేకపోవటంతో.. టీడీపీలో చేరాలని వాసిరెడ్డి పద్మ ప్రయత్నాలు చేసినట్లు ఆ పార్టీ నేతల సమాచారం. ఇందు కోసం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తో చర్చలు చేసారు. చిన్ని ద్వారా టీడీపీలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. చిన్న మాట్లాడటంతో తొలుత లోకేష్ అంగీకారం తెలిపారని.. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. వాసిరెడ్డి పద్మ చేరిక పైన ఉమ్మడి క్రిష్ణా జిల్లా నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేయగా.. వ్యతిరేకత వచ్చిందని.. దీంతో, చంద్రబాబు సైతం నో చెప్పారని పార్టీ నేతల సమాచారం. దీంతో.. వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ ప్రస్తుతం టీడీపీ, జనసేన లో ఛాన్స్ లేకపోవటం తో ఇప్పుడు బీజేపీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో, ఇప్పుడు పద్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications