జగన్ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలకు ఎన్డీయే కూటమి సవాల్ ఇలా..!
కుల రాజకీయాలకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కూడా మినహాయింపేమీ కాదు. కానీ గత ఎన్నికల్లో ఈ కుల రాజకీయాలకు పదునుపెట్టి తన సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో ప్రత్యర్ధుల్ని చిత్తు చేసిన సీఎం వైఎస్ జగన్ ఈసారి కూడా వాటినే నమ్ముకున్నారు. పలు చోట్ల జనరల్ సీట్లలో బీసీలను నిలబెట్టడం, ఎస్సీ సీట్లలో మాల మాదిగల మార్పులు, సంప్రదాయ కమ్మ సామాజిక వర్గ సీట్లలో బీసీలు, మైనార్టీలకు చోటివ్వడం వంటి వ్యూహాలతో జగన్ ముందుకెళ్తుంటే పలు చోట్ల వీటిని బ్రేక్ చేసేలా ఎన్డీయే అభ్యర్ధుల ప్రకటనలు ఉన్నాయి.
ఏపీలో గత ఎన్నికల్లో పలు చోట్ల జనరల్ సీట్లలో బీసీలు, ఇతర వెనుకబడిన కులాలకు సీట్లు ఇచ్చి గెలిపించుకున్న జగన్.. ఈసారి కూడా ఈ ప్రయోగాలను కొనసాగించారు. ఇలాంటి వాటిలో పలు చోట్ల ఎన్డీయే పక్షాలు మాత్రం తమ సంప్రదాయ కులాలకే అవకాశం కల్పించి సవాల్ విసురుతున్నాయి. మరి ఈ సవాల్ లో ఎవరు గెలవబోతున్నారనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఉదాహరణకు కమ్మ సామాజిక వర్గ నేతల్ని పలుమార్లు గెలిపించిన రాజమండ్రి ఎంపీ స్ధానంలో గత ఎన్నికల్లో బీసీ అభ్యర్ధి మార్గాని భరత్ ను నిలబెట్టిన జగన్ ఈసారి గూడూరి శ్రీనివాస్ కు సీటిచ్చారు. అయితే ఎన్డీయే మాత్రం పురందేశ్వరిని నిలబెట్టింది.

అలాగే విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటును గతంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చిన వైసీపీ ఈసారి ముస్లిం అభ్యర్ధి ఆసిఫ్ కు కేటాయించింది. అయితే దీనికి విరుగుడుగా బిగ్ షాక్ సుజనా చౌదరిని తెచ్చి బీజేపీ అదే సీటులో నిలబెట్టింది. అలాగే బ్రాహ్మణ, కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న విజయవాడ సెంట్రల్ లో వైశ్యుడైన వెల్లంపల్లికి జగన్ సీటిస్తే.. ఎన్డీయే మాత్రం టీడీపీ కాపు అభ్యర్ధి బోండా ఉమను కొనసాగిస్తోంది. అలాగే అనకాపల్లి ఎంపీ సీటులో కొప్పుల వెలమ అయిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడ్ని జగన్ నిలబెడితే ఎన్డీయే వెలమ అయిన సీఎం రమేష్ ను బరిలోకి దించుతోంది.
అలాగే నరసరావుపేట సీటులో బీసీ అభ్యర్ధి అనిల్ యాదవ్ ను జగన్ బరిలోకి దింపితే టీడీపీ మాత్రం సంప్రదాయ కమ్మ వర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయల్ని కొనసాగిస్తోంది. గుంటూరు ఎంపీ సీటు పరిధిలోనూ కాపు అభ్యర్ధి కిలారు రోశయ్యను జగన్ బరిలోకి దింపితే టీడీపీ మాత్రం కమ్మ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ను రంగంలోకి దింపుతోంది. ఇలా రాష్ట్రంలో పలు చోట్ల జగన్ ఈసారి కూడా సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకుంటుంటే ఎన్డీయే పక్షాలు, ముఖ్యంగా టీడీపీ సంప్రదాయ కులాల అభ్యర్ధులకే మొగ్గు చూపి సవాల్ విసురుతోంది.












Click it and Unblock the Notifications