కస్టమర్ల కష్టాలకు చెక్, బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పులు - ఇక నుంచి..!!
బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కస్టమర్ల కష్టాలకు చెక్ పెట్టేలా కొత్త విధానాలు అమల్లోకి వస్తున్నాయి. నామినీ విధానంతో పాటుగా లాకర్ల సమస్యలకు పరిష్కారం చూపుతూ కీలక నిర్ణయాలు జరిగాయి. దీనికి సంబంధించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025'ను పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ ఏడాది నవంబరు 1 నుంచి బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
బ్యాంకుల ఖాతాదారుల సమస్యలకు పరిష్కారం దిశగా కీలక నిర్ణయాలు జరిగాయి. కొత్త బ్యాంకింగ్ చట్టాలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా మార్పుల్లో భాగంగా బ్యాంకు డిపాజిటర్లు ఇక నలుగురి వరకు నామినీలను నామినేట్ చేయవచ్చు. ఈ నలుగురిని ఒకేసారి లేదా ఒకరి తర్వాత ఒకరిని నామినేట్ చేయవచ్చు. ఈ మార్పు వల్ల డిపాజిట్ ఖాతాదారుడికి జరగరాని అనర్థమేదైనా జరిగితే, డిపాజిట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ తేలికవుతుంది.

అదే విధంగా లాకర్లు, సేఫ్ కస్టడీలోని వస్తువుల విషయం లో నామినేషన్‌కు అవకాశం ఉంటుంది. అంతేకాదు వరుస క్రమం ప్రకారం మాత్రమే నామినీలకు లాకర్లను నిర్వహించే అధికారం ఉంటుంది. ఈ చట్టం ద్వారా ఖాతాదారు తన తదనంతరం తన డిపాజిట్ లేదా లాకర్‌లోని వస్తువుల్లో ఏ నామినీకి ఎంత మొత్తం లేదా ఎంత శాతం చెల్లించాలనే విషయాన్ని ముందుగానే బ్యాంకుకు తెలియజేయవచ్చు.
అదే విధంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, లాకర్లు, సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు ఉన్న వ్యక్తిగత/జాయింట్ లేదా సోల్ ప్రొప్రైటరీ ఖాతాదారులు అందరూ.. ఇక తమకు నచ్చిన నలుగురిని తమ నామినీలుగా నామినేట్ చేయవచ్చు. ఒకేసారి లేదా వరుస క్రమంలో తమ ప్రాధాన్యత ప్రకారం నామినీలను నామినేట్ చేసే వెసులుబాటు కల్పించారు. కాగా.. కొత్త నిబంధనలతో క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరగనుంది.
దీంతో క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆలస్యం, వివాదాలకు కూడా అవకాశం లేకుండా మార్పులు చేసారు. జాయింట్ ఖాతాదారులు పరస్పర అంగీకారంతో నామినీల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయవచ్చు. దీని వల్ల ఖాతాదారుడు చనిపోయిన సమయంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత తేలికవుతుంది. ఇక నుంచి ఎలక్ట్రానిక్ పద్దతి లోనే అన్ని అంశాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications