ఇద్దరు చంద్రుల మధ్య కొత్త పోటీ! : ఎవరి వ్యూహాల్లో వారు బిజీ..
నగదు రహిత లావాదేవీలకు రాష్ట్ర ప్రజలను సంసిద్దం చేసే విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సీఎంల ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది.
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. భవిష్యత్తులో కరెన్సీ వినియోగానికి కాలం చెల్లిపోయే రోజులే కనిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రజలను సమాయత్తం చేయడానికి ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు సంసిద్దమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నడుమ దీనికి సంబంధించి ఆరోగ్యకరమైన పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

హైటెక్ సీఎం ప్లాన్స్:
హైటెక్ బాబుగా ముద్రపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. సాంకేతికతకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ ముందుండడానికే ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కింది స్థాయి వర్గాలకు, మహిళలకు నగదు రహిత లావాదేవీలను నిర్వహించడానికి త్వరలోనే శిక్షిణ కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.

సాధారణ మొబైల్స్ తోను లావాదేవీలు జరిపేలా:
పేద మధ్యతరగతి ప్రజలకు స్మార్ట్ ఫోన్లు అంతగా అందుబాటులో లేని నేపథ్యంలో.. సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారానే లావాదేవీలు జరుపుకునే వెసులుబాటుపై సీఎం చంద్రబాబునాయుడు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం అవసరమైన కార్యచరణ రూపొందించేందుకు అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేసినట్లుగా సమాచారం.

కేసీఆర్ ఓ అడుగు ముందే..:
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. తొలుత ప్రధాని నిర్ణయంపై తటస్థ వైఖరిని కొనసాగించినా.. ఆ తర్వాత ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకటన చేయడం.. పైలట్ ప్రాజెక్టు తరహాలో సిద్దిపేటను క్యాష్ లెస్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేయడం మొదలయ్యింది.

దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలపడానికి:
నగదు రహిత లావాదేవీల విషయంలో దేశంలో తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం ఓ మొబైల్ యాప్ ను తయారుచేయడంతో పాటు.. నగదు రహిత కార్యచరణను ఓ ఉద్యమం తరహాలో చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేటలో స్వైపింగ్ మెషీన్ల పంపిణీ వాటి పనితీరుపై అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు.

నగదు రహిత గ్రామానికి 10లక్షలు:
నగదు రహిత లావాదేవీల విషయంలో గ్రామాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొల్పేందుకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు నజరానా ప్రకటించారు. 100శాతం నగదు రహిత లావాదేవీల సాధించే తొలి గ్రామానికి రూ.10లక్షల అందజేస్తామని ప్రకటించారు. అలాగే ఆ ఆర్వాతి స్థానంలో నిలిచే గ్రామానికి రూ.5లక్షలు అందజేస్తామని తెలిపారు. దీంతో నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు ఓ అవగాహన ఏర్పడడంతో పాటు.. గ్రామాల్లో వీలైనంత త్వరగా నగదు రహిత లావాదేవీలను వేగవంతం చేయవచ్చనేది తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ గా తెలుస్తోంది.

ఇద్దరు చంద్రుల మధ్య పోటీ :
రాష్ట్ర విభజన తర్వాత.. పాలనకు సంబంధించిన ప్రతీ విషయంలోను ఇద్దరు చంద్రుల మధ్య పోలికలు తీసుకొచ్చి.. ఎవరి సామర్థ్యం ఎంత? అన్న లెక్కలు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఏ సీఎం పనితీరు మెరుగ్గా ఉండబోతుంది? ఎవరు ముందుగా మెరుగైన ఫలితాలను అందుకోబుతున్నారు? వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా రెండు రాష్ట్రాల నడుమ ఇదో ఆరోగ్యకరమైన పోటీకి దారితీసిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications