ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలు-సెప్టెంబర్ సరుకులపై మంత్రి క్లారిటీ..!
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. విజయవాడలో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి తొలి కార్డు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మొత్తం నాలుగు విడతల్లో ఈ స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ జరగబోతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో రేషన్ సరుకుల పంపిణీపైనా మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేశారు.
విజయవాడ వరలక్ష్మీ నగర్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ లక్ష్మిశ ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ కార్డ్ లు పంపిణీ చేశారు.
నేటి నుంచి రాష్టవ్య్రాప్తంగా స్మార్ట్ కార్డ్ లను పంపిణీ చేస్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. పండుగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డ్ ల పంపిణి జరుగుతోందన్నారు. సుపరిపాలనలో భాగంగా ప్రతీ పథకాన్నీ టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

9 జిల్లాల్లో ఈరోజు కార్డ్ ల పంపిణీ జరుగుతుందని, అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోనూ పంపిణి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 5 లక్షల 71 వేల మందికి ఈ కార్డ్ ల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్డ్ ల పంపిణీ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను కూడా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 1 కోటి 45 లక్షల స్మార్ట్ కార్డ్ లు ఉచితంగా అందజేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. సెప్టెంబర్ 1 వ తేదీ నాటికి గతంలో లానే రేషన్ తీసుకున్నట్టు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.












Click it and Unblock the Notifications