టీటీడీ మెరుపు నిర్ణయాలు
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, బాధ్యతగా సేవలు అందించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. బదిలీపై వెళ్లిన ఈఓ జే శ్యామలరావు స్థానంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ, భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలని అన్నారు. టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు తీసుకునే నిర్ణయాలు, వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్, డయల్ యువర్ ఈవో, ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలని అన్నారు.

ఆధునిక టెక్నాలజీ సాయంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. టీటీడీలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని చెప్పారు. తక్షణం చేపట్టే అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని, భక్తులకు అందించే సేవలతోపాటు, విధానపరమైన నిర్ణయాలలో టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమిష్టిగా నిర్ణయం తీసుకుని భక్తులకు వేగంగా, నాణ్యంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధానపరమైన వ్యవస్థలను తీసుకువచ్చామని, దశలవారీగా అన్ని శాఖలలో ఇదే విధానాన్ని తీసుకువచ్చి వ్యవస్థలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవోకు వివరించారు. స్థానిక ఆలయాలలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టామని జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు.
హింధూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన ఈఓకు తెలియజేశారు. టీటీడీ స్థానిక ఆలయాలను 14 జోన్లుగా విభజించి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కార్యాచరణ చేపట్టామన్నారు. సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ, అలిపిరి టోల్ గేట్ వద్ద ఆధునికరించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు మోసాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications