ఏపీకి శుభవార్త.. రాబోయే 4 రోజులు మనవే
ఛత్తీస్‌గఢ్, ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఏపీ మొత్తం విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం తేలికపాటి జల్లులు, మంగళ, బుధ, గురువారాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీ వర్షాలుంటాయని తెలిపింది.
శ్రీకాళహస్తిలో అత్యధికం
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో వానలు కురుస్తాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో చెదురు మదురుగా జల్లులు కురిశాయి.

రెండునే ప్రవేశించిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఈనెల రెండోతేదీనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్రమంతటా విస్తరించే క్రమంలో విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత నిశ్చలంగా ఉండిపోయాయి. దీంతో చినుకు జాడ లేకుండా పోయింది. వేసవి కాలంలో ఉన్నట్లుగా వాతావరణం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న మూడురోజుల్లో రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతాయని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురియాలంటే రుతుపవనాలు మరింత బలం పుంజుకోవాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలో రైతులు లక్షలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. అయితే ఎండలకు అవి ఎండిపోవడంతో వానలు పడతాయేమోననే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఏపీలో కూడా వాణిజ్య పంటలైన మిరప, పత్తి పండాలంటే లక్షలాది ఎకరాలకు వర్షాలే ఆధారం.












Click it and Unblock the Notifications