క్షీర, వరం : తక్కువ సమయం, ఎక్కువ దిగుబడి, ఇవే కొత్తరకం వంగడాలు
పెనుమంట్ర : మరో రెండు కొత్త వరి వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ పరిధిలోని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కొత్త వంగడాలను డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ నాయుడు విడుదల చేశారు. ఈ వంగడాలు మార్టేరు వరి పరిశోధన కేంద్రానికి మంచిపేరు తీసుకొస్తాయని శాస్త్రవేత్త పాలగుడు సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతికూల, అనుకూల వాతవరణాల్లో సార్వా, దాళ్వాల్లో సాగుచేసే రైతులకు అధిగ దిగుబడులు ఇచ్చే వరి వంగడాలను కనుగొనాలని శాస్త్రవేత్తలను నాయుడు కోరారు.

క్షీర వంగడం ..
స్వర్ణ, అమర రకాలతో క్షీర రకం వంగడాన్ని రూపొందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశాల్లోని ముంపు ప్రాంతాల్లో సాగుకు అనువైన రకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పంట కాలపరిమితి 150 రోజులు అని, 10 రోజుల తాత్కాలిక ముంపును తట్టుకుంటుందని వివరించారు. అడుగు నుంచి అడుగున్నర మేర నీరు నిలబడే పల్లపు ప్రాంతాల్లో పంట దిగుబడి బాగుంటుందని పేర్కొన్నారు. ధాన్యం స్వర్ణలాగా ఎరుపురంగు కలిగి 10, 12 పిలకలు వేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. కొంత మేర ఎండాకు, అగ్గి, పొట్ట కుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. మొక్క 110 సెంటీమీటర్ల ఎత్తులో ఆకుపచ్చ రంగులో ఉండి వెన్నులు పూర్తిగా బయటకు వస్తాయి. కాండం దృఢంగా ఉంటుంది. గింజ రాలుడు తక్కువ. రెండు వారాలు నిద్రావస్థ కలిగి ఉంటుంది. ముంపునకు గురైన పొలాల్లో హెక్టారుకు 4.5 టన్నులు, సాధారణ ప్రాంతాల్లో 6.0 టన్నులు దిగుబడినిస్తుంది. ధాన్యం మిల్లు ఆడినపుడు 61శాతం నిండుగింజలు వస్తాయి.
వరం వంగడం ..
ఎంటీయూ 1081, స్వర్ణం సబ్‌వన్ రకాలను సంకరం చేసి రూపొందించారు. మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి బీపీటీ 5204 కన్నా 25.41 శాతం అధిక దిగుబడిని ఇస్తోంది. కాలపరిమితి సార్వాలో 140 రోజులు, దాళ్వాలో 120 రోజులు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు అనువైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొక్క ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, వెన్ను పూర్తిగా బయటకు వస్తుంది. మొక్క ఎత్తు 105 సెంటీమీటర్లు. 10-12 పిలకలు చేయు సామర్థ్యం ఉంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడదు. గింజ రాలుడు తక్కువ అని సైంటిస్టులు తెలిపారు. హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడిస్తుంది. ధాన్యం తెల్లగా గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. దిగుబడి ఎక్కువ. అన్నం ముద్ద కాకుండా పొడిగా ఉంటుంది.












Click it and Unblock the Notifications