ఏపీ అసెంబ్లీ: బాబు కూడా చిరాకు పడ్డారు! ఆగస్టులో...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అన్నీ సమస్యలే ఉన్నాయని ఎపి రాష్ట్ర శాసన సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్వయంగా ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం విసుక్కునే స్థాయిలో ఉందట. ఇటీవల ఐదు రోజుల పాటు ఎపి అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
అయితే, శాసన సభలో ఏసీ లేక సభ్యులు చెమటలు కక్కారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని విధంగా సభ ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ సభ్యులదీ అదే పరిస్థితి అట.

ఏసీ లేని, పాత భవనం ఇచ్చారని అదీ ఇరుకుగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే సభ్యులు సభలో సరిగా ఉండలేకపోయారట కూడా. ఇక చివరి వరుసల్లో ఉన్న వారికి మైకులు సరిగా వినిపించలేదు. ఎపి అసెంబ్లీని చూసి చంద్రబాబుకే చిరాకు కలిగిందట. ఐదు రోజుల అసెంబ్లీకే ఇలాంటి పరిస్థితి ఉంటే సుదీర్ఘంగా సాగే బడ్జెట్ సమావేశాలకు ఇంకెంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
శాసన సభ సముదాయం బాగా లేదనేందుకు చంద్రబాబు ఎపి కౌన్సిల్‌లో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. కౌన్సిల్‌కు హాజైరన చంద్రబాబు.. కౌన్సిల్ బాగుందని, ఇక్కడ ఏసీ కూడా పని చేస్తుందని, శాసన సభలో ఏసీ పని చేయడం లేదని, సీట్లు బాగా లేవని చెప్పారు. ఆగస్టులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అప్పటి లోగా ప్రత్యామ్నాయం కోసం ఎపి ప్రభుత్వం చూస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications