ముహూర్తం 3 లేదా4: బెజవాడలో చంద్రబాబు ప్రమాణం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జూన్ 2 తర్వాత విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీమాంధ్రలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి పని చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు.
అందుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. జూన్ రెండో తేదీన రెండు రాష్ట్రాల ఆవిర్భావం జరుగుతున్న నేపథ్యంలో మంచి రోజు చూసుకుని జూన్ 3 లేదా 4వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడను వేదికగా ఎంపిక చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

ప్రమాణ స్వీకారానికి తిరుపతి పేరు కూడా ప్రతిపాదనకు వచ్చినట్లు సమాచారం. సాధారణంగా చంద్రబాబు ముఖ్యమైన కార్యక్రమాలకు తిరుపతిలో శ్రీకారం చుడతారు. ఈసారి తెలుగుదేశానికి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన కోస్తా ప్రాంతానికి కేంద్రంగా ఉన్న విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయాలని నేతలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు వివిధ జిల్లాల ప్రజలు, అభిమానులు హాజరయ్యేందుకు కూడా విజయవాడ అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో విజయవాడ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ప్రమాణ స్వీకారంతో పాటు విజయవాడ - గుంటూరు మధ్య భారీ బహిరంగ సభకు నిర్వహించేందుకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు. విజయవాడలో ప్రమాణ స్వీకారానికి ఎక్కువగా అవకాశముంది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications