అసెంబ్లీ సీట్ల పెంపుకు కేంద్రం నో: ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?
అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం షాక్ ఇచ్చింది. నియోజకవర్గాల పెంపు ఉంటుందని వచ్చే ఎన్నికల్లో అందరికీ సీట్లు కేటాయిస్తామని 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరలేపిన అధికార పార్టీలకు ఇది మింగుడుపడని విషయమే. తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు ఉండదని కేంద్రం బుధవారం రాజ్యసభలో స్పష్టం చేసింది.
దీని ప్రకారం చూస్తే ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పంపు లేనట్టుగానే అనిపిస్తోంది. విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. దీంతో రాజ్యంగానికి లోబడి నియోజక వర్గాల సీట్లను పెంచవచ్చా అన్న దానిపై కేంద్రం అటార్నీజనరల్ వివరణ కోరింది.
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని, ఇందుకు రాజ్యాంగం నిబంధనలు ఒప్పుకోవని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఒకేవేళ నియోజక వర్గాలు పెంచాలని నిర్ణయిస్తే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. కానీ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ర్టాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలని కోరుతున్నారు.

అయితే నియోజకవర్గాల పెంపుపై టీడీపీ ఎంపీ దేవేందర్‌గౌడ్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు హోం శాఖ సహాయమంత్రి గంగారామ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏపీ విభజన చట్టంలో అవసరం మేరకు నియోజకవర్గాలను పెంచుకోవచ్చని పేర్కొన్నప్పటికీ 2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజన కుదరదంటూ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.
నియోజక వర్గాల పెంపుని సాకుగా చూపి ఏపీలో టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో విపక్షాన్ని లేకుండా చేసే ఉద్దేశంతో అధికార పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్' కు తెరలేపారు. పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దంటూ అధికార పార్టీకి చెందిన ఆయా నియోజక వర్గాల్లోని కార్యకర్తలు పలు సందర్భాల్లో వ్యతిరేకించారు.
అయితే వ్యతిరేకించిన ఆయా నియోజక వర్గ నేతలకు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం చెప్పిన మాట 2019 నాటికి ఏపీలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు ఉంటుందని, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో వారు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు అంగీకరించారు.
అయితే తాజాగా 2026 నాటికి నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయించిన రాజకీయ నాయకుల పరిస్థితి ఏమవుతుందో?












Click it and Unblock the Notifications