నమ్మకం కలిగింది: టిపై మేకపాటి, చిరుపై గంటా క్లారిటీ
హైదరాబాద్: తాము జాతీయ పార్టీ నాయకులను కలిసిన తర్వాత సమైక్యం పైన నమ్మకం కలిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని చెప్పిన సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు ఇప్పుడు ప్యాకేజీల గురించి మాట్లాడటం విడ్డూరమని ధ్వజమెత్తారు. కొందరు నేతల నుండి వస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదన ప్రజల నుండి వచ్చింది కాదన్నారు.
ఉమ్మడికి కాలపరిమితి: సర్వే
హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చేస్తే అందుకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ ఇచ్చి అన్ని అధికారాలను లాక్కుంటామంటే ప్రజలు ఒప్పుకోరాన్నారు. సీమాంధ్రులను హైదరాబాదు నుండి పంపేస్తామన్న భయాన్ని తొలగించాలని సర్వే చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే సోనియా తెలంగాణ ఇచ్చారని, సీమాంధ్రులకు భరోసా ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు.

పార్టీలో ఎవరు మిగలరు: గంటా
విభజన విషయంలో చర్యలు తీసుకోదలిస్తే పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా అందరూ సమైక్యవాదం వినిపిస్తున్నారని చెప్పారు. అందరి పైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిది సమైక్యవాదమే అయినా అధిష్టానం నిర్ణయం కారణంగా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. సొంత జిల్లాకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంచి నీరు తీసుకు వెళ్లడంలో తప్పులేదన్నారు. అన్ని ప్రాంతాలకు మంచినీరు తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
సమైక్యంగానే ఉంటుంది: రఘువీరా రెడ్డి
రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని మంత్రి రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లాలో అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరుగుతాయన్నారు.
కిరణ్‌పై తుమ్మల
విభజన దృష్ట్యా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరాలని టిడిపి నేత తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాదులో డిమాండ్ చేశారు. ఈ నెల 29న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చే తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినదని, రెండు రాష్ట్రాలుగా విడిపోతే నీటి పంపకాలపై ట్రైబ్యునల్ తీర్పులో స్పష్టత ఉండదని అన్నారు. నదీ జలాల పైన కిరణ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications