విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్మానుష్యమైన బెజవాడ రైల్వే స్టేషన్: అసలు కారణం ఇదీ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ రైల్వే స్టేషన్ నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. 300కు పైగా రైళ్ల రాకపోకలతో బిజీగా ఉంటుంది. జంక్షన్ కావడంతో దాదాపు ఏపీ, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే చాలా రైళ్లు విజయవాడను దాటుకునే వెళుతుంటాయి.

ఏపీలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ గా, లక్ష మందికి పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తుండే విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు బోసిపోయింది. రైళ్ల సిగ్నలింగ్ వ్యవస్థను అత్యాధునికీకరిస్తున్న సందర్భంగా, ఈ ఉదయం నుంచి అన్ని రైళ్లనూ శివార్లలోని స్టేషన్లలోనే నిలిపివేస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ సెప్టెంబర్ 20 నుంచి 28 వరకూ ఈ రైల్వే స్టేషన్‌లో రైలు కూతగానీ, ట్రైన్ వస్తున్నట్టు, వెళుతున్నట్టు అనౌన్స్‌మెంట్ గానీ వినిపించదు. స్టేషన్ కు ఒక్క రైలు కూడా రాదు. దీంతో కొద్దిమంది అధికారులు మినహా, ప్రయాణికులు లేక స్టేషన్ నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

no trains in vijayawada railway station due signaling work

దీనంతటికీ కారణం విజయవాడలో జంక్షన్‌లో నెలకొన్న సిగ్నలింగ్ సమస్యను మెరుగుపరిచేందుకు అధికారులు చేపట్టిన భారీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్లాట్‌ఫామ్‌లను ఆధునీకరించనున్నారు. దాదాపు 150 కోట్ల వ్యయంతో... 2వేల మంది కార్మికులు రాత్రిపగలూ శ్రమించి ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.

దీనివల్ల భారీ సంఖ్యలో రైళ్లను అధికారులు రద్దు చేశారు. దారి మళ్లించి గమ్యస్థానాలకు పంపిస్తున్నారు. గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లను సీతానగరంలో, హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లను కొండపల్లి, విశాఖ నుంచి వచ్చే రైళ్లను గుణదల స్టేషన్లలో నిలిపి, అక్కడే ప్రయాణికులను దించి, ఔటర్ లైన్ మీదుగా నగరాన్ని దాటిస్తున్నారు.

దీంతో ఈ రైల్వే స్టేషన్లలో సందడి నెలకొంది. ఇక్కడ దిగితే, నగరంలోకి వెళ్లేందుకు సరైన సదుపాయాలు లేవని, ఆటో డ్రైవర్లు అధిక మొత్తాలను డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో 10 ప్లాట్‌ఫామ్‌లున్నాయి. వాటిలో... 8, 9, 10 ప్లాట్‌ఫామ్‌లపైకి ఒకవైపు నుంచి మాత్రమే రైళ్లు వచ్చి పోతాయి.

2 నుంచి 5 ప్లాట్‌ఫామ్‌లపైకి 24 బోగీలున్న ఎక్స్‌ప్రెస్‌లేవీ రాలేవు. ఎందుకంటే... అందుకు తగిన సిగ్నలింగ్‌ వ్యవస్థ లేదు. 'సిగ్నల్‌ ప్రాబ్లమ్‌'తో బెజవాడ జంక్షన్‌ ఎప్పుడు చూసినా జామ్‌. ఈ కష్టాలు తీరిపోనున్నాయి. 8 రోజులు... 150 కోట్ల వ్యయం... రెండువేల మంది కార్మికులు... పదుల సంఖ్యలో అధికారులు... ఒక మహాయజ్ఞం.

అది పూర్తికాగానే... విజయవాడ జంక్షన్‌లో ఔటర్‌లో పడిగాపులు ఉండవు. ప్లాట్‌ఫామ్‌ల మధ్య తేడాలూ ఉండవు. రైళ్లు రయ్య్‌మని వస్తాయి! రాకపోకలు సాగిస్తాయి. అత్యాధునిక రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ (ఆర్‌ఆర్‌ఐ) సిగ్నలింగ్‌ వ్యవస్థ, ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణతో ఇది సాధ్యం కానుంది.

అత్యంత రద్దీగా ఉండే విజయవాడ రైల్వే జంక్షన్‌లో 8 రోజులపాటు రైళ్ల రాకపోకలు ఆగిపోవడమంటే సామాన్యం కాదు. అనేక రైళ్లను పూర్తిగా రద్దు చేస్తుండగా... పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు. విజయవాడ పరిసరాలలో శాటిలైట్‌ రైల్వే స్టేషన్లు ఉండటం వల్ల బైపాస్‌ మార్గంలో చాలా వరకు రైళ్లను మళ్లించేందుకు అవకాశం ఏర్పడింది.

ఇండియన్ రైల్వేలో బెజవాడ జంక్షన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే అతిపెద్ద జంక్షన్‌ ఇదే. నిత్యం విజయవాడ మీదుగా 300 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ డివిజన్ నుంచి ఏటా రూ. 4వేల కోట్ల ఆదాయం దక్షిణ మధ్య రైల్వేకు సమకూరుతోంది.

మరోవైపు... నవ్యాంధ్ర రాజధాని రైల్వేస్టేషన్‌ కూడా ఇదే. అయినా... జంక్షన్‌లో ఎప్పుడూ జామ్‌. పూర్తి స్థాయిలో సిగ్నలింగ్‌ వ్యవస్థ లేకపోవటంతో నగర శివార్లలో గంటల తరబడి రైళ్లను నిలిపివేయాల్సి వస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి.

2004లో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా 8, 9, 10 ప్లాట్‌ ఫారాలను ఆగమేఘాల మీద నిర్మించారు. ఈ హడావుడిలో ఒక వైపే రైళ్లు వెళ్లేలా సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిపై ఉన్న ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ కృష్ణా కెనాల్‌ మీదుగా వచ్చే రైళ్లను తీసుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

విజయవాడ నుంచి సికింద్రాబాద్‌, న్యూఢిల్లీలకు ఈ ప్లాట్‌ఫామ్‌ల మీదుగా రైళ్లు వెళతాయి. కానీ, అటు వైపు నుంచి వచ్చే రైళ్లను ఈ ప్లాట్‌ఫామ్‌ల పైకి మళ్లించే అవకాశం లేదు. ఇక... 2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలలోనూ సిగ్నలింగ్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరించలేదు. దీంతో వీటిపైకి 24 బోగీల సామర్థ్యం ఉన్న ఎక్స్‌ ప్రెస్‌ రైళ్ళు రాలేని పరిస్థితి.

వెరసి... 10 ప్లాట్‌ఫామ్‌లున్న విజయవాడలో 1, 6, 7 మాత్రమే పూర్తిగా పనిచేస్తున్నాయి. భారీ సంఖ్యలో వచ్చిపోయే రైళ్ల రాకపోకలను నియంత్రించడం తలకుమించిన భారంలా మారింది. ప్లాట్‌ఫారాలు ఖాళీ లేక ఔటర్‌ సిగ్నల్‌ నిలపాల్సి వస్తోంది. ఈ కష్టాల నుంచి విజయవాడ జంక్షన్‌ను బయట పడేసేందుకు అత్యాధునిక రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ (ఆర్‌ఆర్‌ఐ) సిగ్నలింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.

English summary
no trains in vijayawada railway station due signaling work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X