టీటీడీలో నూతన పథకం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 75,691 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 39,050 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.16 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం భక్తులకు 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.08 లక్షల లడ్డూలు విక్రయం కాగా.. 2.53 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
కాగా భక్తుల కోసం టీటీడీ ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. టీటీడీ ఆసుపత్రుల్లో "శ్రీవారి వైద్య సేవ" కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈవో ముద్దాడ రవిచంద్ర దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసింది టీటీడీ. వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటుంది.

ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సేవలందించవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజులు, ఎంబీబీఎస్ డాక్టర్లకు ఏడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం టీటీడీ కల్పించింది. వారికి తిరుమల, తిరుపతిలో వసతి సౌకర్యాలు అందిస్తుంది.
టీటీడీ ఆధీనంలోని అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థల్లో వారి సేవలను టీటీడీ వినియోగించుకుంటుంది. హిందూ మతానికి చెందిన ఆసక్తిగల డాక్టర్లు ఆన్‌లైన్ ద్వారా టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions లో తమ స్లాట్‌ను బుక్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర మాట్లాడారు. విద్య, వైద్యం, ఐటీ తదితర రంగాల్లో సేవా భావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ వేదికగా నిలుస్తుందని రవిచంద్ర పేర్కొన్నారు. టీటీడీ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసి ఎక్కువ మంది నిపుణుల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపడతామని వివరించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం, సికింద్రాబాద్ కిమ్స్ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ఏ శాస్త్రి, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, బెంగళూరు ఈఎస్ఐ హాస్పిటల్ ఆర్థో హెచ్ఓడి డాక్టర్ పురుషోత్తం తదితరులు ఈవోతో వర్చువల్‌గా మాట్లాడారు. టీటీడీ ఆసుపత్రుల్లో సేవలందించే అవకాశం కల్పించడం శ్రీవారి అనుగ్రహంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications