హుటాహుటిన ధర్మేంద్ర ప్రధాన్ ను పిలిపించిన అమిత్ షా- రాజీనామా తప్పదా?
నీట్ పేపర్ లీక్ వివాదం మరింత ముదిరింది. రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ పలు విద్యార్థి సంఘాలు, వివిధ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి పోరు బాట పట్టారు. దేశరాజధానిలో పోరుబాట పట్టారు. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసరంగా భేటీ అయ్యారు. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంట్ పేరుతో దూసుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య ఈ భేటీ ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఉదయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమైన విషయం తెలిసిందే. మధ్యాహ్నం సభ వాయిదా పడ్డ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ నేరుగా అమిత్ షాతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఆయనకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా సూచించారు. ఆ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్.. అమిత్ షాతో ఆయన ఛాంబర్ లో భేటీ అయ్యారు. ఈ అత్యవసర సమావేశంలో పేపర్ లీక్ వివాదాన్ని చక్కబెట్టడంపై చర్చించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం కూడా ఇప్పటివరకు అందలేదు. అటు ప్రభుత్వ వర్గాల నుంచి కూడా దీనిపై ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మున్ముందు రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై సర్వత్రా సందిగ్ధత, ఉత్కంఠత నెలకొంది. ఇంకాస్సేపట్లో అమిత్ షా- ధర్మేంద్ర ప్రధాన్ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడి కావొచ్చు.
మరోరవంక.. ఈ ఉన్నత స్థాయి భేటీకి కొన్ని గంటల ముందే ఢిల్లీలో నాటకీయ పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు ఉదయం నుంచే పార్లమెంట్ వైపు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ సమీపంలో చేరిన జనాన్ని శాంతింపజేయడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. నిరసనకారుల సంఖ్య పెరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అదుపు తప్పింది.
ఘర్షణ తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. శాస్త్రి భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన రక్షణ బారికేడ్లను దాటడానికి నిరసనకారులు తీవ్రంగా ప్రయత్నించారు. దీనితో ఢిల్లీ పోలీసులు లాఠీలను ఝుళిపించారు. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో పలువురు కార్యకర్తలు, పోలీసులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications